iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2001 బద్వేల్‌ ఉప ఎన్నిక గురించి తెలుసా..?

వైఎస్సార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2001 బద్వేల్‌ ఉప ఎన్నిక గురించి తెలుసా..?

ఏదైనా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే.. మరణించిన ఎమ్మెల్యేకు చెందిన పార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు దాదాపు 90 శాతంపైనే ఉంటాయి. అతి తక్కువ సందర్భాలలోనే ఇతర పార్టీలు గెలుస్తుంటాయి. ఇక చనిపోయిన ఎమ్మెల్యే అధికార పార్టీ అయితే.. ప్రతిపక్ష పార్టీల పోరు నామమాత్రంగానే ఉంటుంది. అధికార పార్టీ, పైగా సానుభూతి ఉందని తెలిసినా.. ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఉప ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడతాయి. ఈ తరహాలోనే 2001లో బద్వేలు ఉప ఎన్నిక జరిగింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతా బద్వేలు ఉప ఎన్నిక వైపు చూసింది.

అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న బిజివేముల వీరారెడ్డి 2000 డిసెంబర్‌ 25వ తేదీన మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సీనియర్‌ నాయకుడైన వీరారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. 1967 నుంచి 1999 వరకు వరుసగా ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసిన వీరారెడ్డి ఆరు సార్లు విజయం సాధించారు. రెండు సార్లు కాంగ్రెస్‌పార్టీ తరఫున, ఒక సారి స్వతంత్ర అభ్యర్ఘిగా, చివరి మూడుసార్లు టీడీపీ అభ్యర్థిగా వీరారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వారసురాలుగా కుమార్తె విజయమ్మ 2001 ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.

Also Read : బద్వేల్ చరిత్రలో మూడో ఉప ఎన్నిక

కడప జిల్లాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా వీరారెడ్డి పోటాపోటీ రాజకీయాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వడ్డెమాను శివరామకృష్ణారావును పోటీలో నిలబెట్టారు. వడ్డెమాను కుటుంబానికి బద్వేలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1962లో మరోసారి సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చిదానందం ఏడాదికే మరణించారు. దీంతో తొలిసారిగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి 1963లో ఉప ఎన్నిక జరిగింది.

ఈ ఉప ఎన్నికల్లో చిదానందం పెద్దకుమారుడు వెంకటరమణయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి నాగిరెడ్డి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1972లో చిదానందం మరో కుమారుడు శివరామకృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి బిజివేముల వీరారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల నుంచే బిజివేముల వీరారెడ్డి, వడ్డెమాను శివరామకృష్ణారావులు ప్రత్యర్థులుగా మారారు. 1999 వరకు ఇద్దరూ తలపడ్డారు. వడ్డెమాను శివరామకృష్ణారావు 1978లో జనతాపార్టీ తరఫున, 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక – పెద్దిరెడ్డి సారథ్యంలో వైసీపీ టీం ఇదే..

తనకు అత్యంత సన్నిహితుడైన శివరామకృష్ణారావు కోసం 2001 ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైఎస్‌ పని చేశారు. అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం, కరువు, విద్యుత్‌ ఉద్యమం వంటి పరిణామాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి అస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వ పాలనను వైఎస్సార్‌ తుర్పారబడుతూ ప్రజల్లోకి వెళ్లారు. హోరాహోరీ పోరులో సాగించారు. అయితే వీరారెడ్డి మరణంతో ఆయన కుమార్తె విజయమ్మపై సానుభూతి, వీరారెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టు నేపథ్యంలో.. విజయం విజయమ్మనే వరించింది. 19,375 ఓట్ల మెజారిటీతో విజయమ్మ గెలిచారు.

2001 ఉప ఎన్నికలే శివరామకృష్ణారావుకు చివరి ఎన్నికలయ్యాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2004లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ డి.సి.గోవిందరెడ్డికి దక్కింది. ఆయన గెలిచారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. తనకు ఆప్తుడైన శివరామకృష్ణారావుకు సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. వైద్య,విధాన పరిషత్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. 2009 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న శివరామకృష్ణారావు.. వైఎస్సార్‌ మరణం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన తన పేరును స్థితప్రజ్ఞగా మార్చుకుని సన్యాసం స్వీకరించారు.

Also Read : శివరామకృష్ణయ్య కుటుంబం లేని బద్వేల్ ఎన్నికలు