iDreamPost
android-app
ios-app

ఆ యువనేత తండ్రికి తగ్గ తనయుడు అవుతారా..?

ఆ యువనేత తండ్రికి తగ్గ తనయుడు అవుతారా..?

రాజకీయాల్లో కొత్తతరాన్ని ప్రొత్సహించేలా యువకులకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన పంథాను ఇటీవల ప్రకటించిన 135 నామినేటెడ్‌ పోస్టులోనూ కొనసాగించారు. దాదాపు 90 శాతం పదవులు ఇప్పటి వరకూ ఎలాంటి పదవి చేపట్టని వారికే జగన్‌ కేటాయించడం విశేషం. కార్పొరేషన్ల చైర్మన్లు, అధ్యక్షులు అయిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం వైసీపీ కో ఆర్డినేటర్‌ బాచిన కృష్ణ చైతన్య ఒకరు. కృష్ణ చైతన్యను సోసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు.

తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు..

అద్దంకి మాజీ ఎమ్మెల్యే అయిన బాచిన చెంచు గరటయ్య కుమారుడైన బాచిన కృష్ణ చైతన్య.. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏడాదికి బాచిన కృష్ణ చైతన్య తండ్రి స్థానంలోకి వచ్చారు. అద్దంకి వైసీపీ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు బెంగుళూరు కేంద్రంగా విద్యా సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. వయో భారం వల్ల గరటయ్య(75) తన కుమారుడును రాజకీయాల్లోకి దింపారు.

ప్రజల నుంచి వచ్చిన నాయకులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో గరటయ్య ఒకరు. వైద్య విద్యను పూర్తి చేసిన తొలినాళ్లలో.. అద్దంకి నియోజకవర్గంలో ఎరువులు, పురుగుమందులు అందక రైతాంగం పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఉవ్వేత్తున ఎగసిన రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన గరటయ్య.. ఉద్యమాన్ని తనదైన శైలిలో నడిపి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఉద్యమం తర్వాత రైతు సంఘాల అవిర్భావం మొదలైంది.

Also Read : బుచ్చయ్య చౌదరి ప్రత్యర్థికి డీసీసీబీ చైర్మన్‌ పదవి

రైతు ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గరటయ్య కొరిశపాడు సమితి ప్రెసిడెంట్‌గా ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో 1975లో గెలిచారు. ఆ తర్వాత మూడేళ్లకు 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థి కరణం బలరాం చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో అద్దంకి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరాంపై విజయం సాధించి సత్తా చాటారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన గరటయ్య.. అద్దంకి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన గరటయ్య.. అద్దంకి కో ఆర్డినేటర్‌గా పని చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న గరటయ్య.. తన కుమారుడును ప్రోత్సహించారు. తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమైన కృష్ణ చైతన్య ఎన్నికల తర్వాత వైసీపీ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు.

తండ్రి నుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలు, ప్రస్తుత కాలానికి అనుగుణంగా రాజకీయాలు చేయడం ప్రారంభించిన కృష్ణ చైతన్య తన సత్తా ఏమిటో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. టీడీపీ గెలిచే మున్సిపాలిటీలలో ఒకటి అద్దంకి అని ఆ పార్టీ నేతలు వేసుకున్న లెక్కలను పంటాపంచలు చేస్తూ మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. 20 వార్డులకు గాను 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 12 వార్డులు గెలుచుని తొలిసారి అద్దంకిలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికల్లోనూ కృష్ణ చైతన్య రికార్డులు బద్ధలు కొట్టారు. కమ్మ సామాజికవర్గం అధిపత్యం ఉన్న గ్రామాల్లోనూ వైసీపీ గెలిచేలా రాజకీయ వ్యూహాలను రచించారు. 103 పంచాయతీలకు గాను 82 పంచాయతీలు వైసీపీ గెలుచుకోవడంతో టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు. ఒక సారి మార్టురు, మూడుసార్లు వరుసగా అద్దంకిలో గెలిచి ఇక తనకు తిరుగులేదనుకుంటున్న రవికుమార్‌కు బాచిన కృష్ణ చైతన్య చుక్కలు చూపించారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన కృష్ణ చైతన్య పనితీరును గమనించిన వైఎస్‌ జగన్‌.. ఆయన్ను మరింత ప్రోత్సహించేలా నామినేటెడ్‌ పోస్టును కట్టబెట్టారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రత్యర్థి రవికుమార్‌తో పోటాపోటీ రాజకీయాలు చేస్తున్న కృష్ణ చైతన్య.. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Also Read : ఎట్టకేలకు కాకుమానికి కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరి