iDreamPost
iDreamPost
బాహుబలి సినిమా రెండు భాగాలూ చూశాం కానీ అసలు దానికన్నా ముందు ఏం జరిగింది, శివగామి లైఫ్ లో ముఖ్యమైన సంఘటనలు ఏమిటి, ఆమెకు భర్తకు మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, ఆ సామ్రాజ్య స్థాపనకు కారణమైన అసలు బాహుబలి ఎవరు లాంటి ఎన్నో ప్రశ్నలు జనం మదిలో మెదిలాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ అవకాశాన్ని వాడుకునే ఉద్దేశంతో బిగినింగ్ కు ముందు ఏం జరిగిందో చూపాలనే ఉద్దేశంతో ఓ వెబ్ సిరీస్ ని మూడేళ్ళ నుంచి తీసే ప్లానింగ్ లో ఉంది. ఇప్పటికే దాని మీద 150 కోట్లకు పైగా ఖర్చయ్యిందట. అయితే ఇంతా చేసి ఆశించిన స్థాయిలో ఇది వచ్చే అవకాశం లేకపోవడంతో పూర్తిగా ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేశారట.
ఇప్పుడీ వార్త నిన్నటి నుంచి మీడియాలో ఒకటే హల్చల్ చేస్తోంది. గతంలో దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు లాంటి వాళ్ళతో కొంత షూట్ చేయించి అది నచ్చక మళ్ళీ బాలీవుడ్ టీమ్ ను తీసుకొచ్చి ఫ్రెష్ గా తీయించి ఇది కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైనల్ గా జెండా తీసేసిందని లేటెస్ట్ అప్ డేట్. సరే ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు వెనుకడుగు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కాకపోతే ఇప్పుడు వద్దు అనుకుంటే నూటా యాభై కోట్లతో ఆగిపోతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఎన్ని వందల కోట్లు అవుతాయో తెలియదు. అందుకే అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలనే ఉద్దేశంతో నెట్ ఫ్లిక్స్ మంచి నిర్ణయమే తీసుకుంది.
ఇంత మొత్తం అంటే టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ బడ్జెట్ తో సమానం. అయినా నెట్ ఫ్లిక్స్ కి ఇదేమంత విషయం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చందాదారులు, వాళ్ళ ద్వారా వస్తున్న రెవిన్యూతో చూసుకుంటే ఇదో పది వేల రూపాయల కింద లెక్క. అందుకే అంత తేలిగ్గా డ్రాప్ అనేసింది. మన దేశం నుంచి తన సంస్థకు సంబంధించిన ఆర్థిక ఫలితాల పట్ల నెట్ ఫ్లిక్స్ ఏమంత సంతోషంగా లేదు. ధరలు తగ్గించినా కూడా హాట్ స్టార్, ప్రైమ్ కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే రీజనల్ కంటెంట్ మీద ఇకపై ఎక్కువ ఫోకస్ పెట్టేలా పలు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.
Also Read : OTT Releases : ఓటిటిలో భారీ సినిమాల సందడి