iDreamPost
android-app
ios-app

అయ్యన్నా…ఇంత అన్యాయమా…?

అయ్యన్నా…ఇంత అన్యాయమా…?

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి కాస్త నోటి దురుసు ఎక్కువే..! బహుశా గట్టిగా మాట్లాడితేనో…సౌండ్ పెంచి ఆరోపణలు చేస్తేనో ప్రజలు తన గురించి మంచిగా అనుకుంటారనే ఆలోచన ఆయనలో ఉన్నట్టుండి. అందుకే సౌండ్ కు ఇచ్చిన ప్రాధాన్యం సబ్జెక్ట్ కి ఇవ్వరు. కాగా, తాజాగా అయ్యన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. కానీ, ఆ విమర్శలు తిరిగి ఆయన్నే ప్రశ్నించేలా ఉండటం గమనార్హం.

జగన్ రాష్ట్ర ప్రజలకు ధైర్యం, భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి…..ఇట్లు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

మీరంతా దురాశతో డబ్బులు కట్టారు…దానికి సీఎం చంద్రబాబుకు, నాకు ఏం సంబంధం… ఏం మీరంతా చంద్రబాబుని అడిగి కట్టారా…మరి ఆయన ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవాలి …. రచన, దర్శకత్వం యాక్టింగ్ …అన్నీ అయ్యన్నపాత్రుడే…!

 పై విమర్శల్లో మొదటిది నిన్నటిది కాగా, రెండోది అయ్యన్న మంత్రిగా చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తమ బాధ చెప్పుకుందామని వచ్చిన మధ్య తరగతి మహిళలు, సామాన్యులకు రాజమండ్రి కేంద్రంగా అయ్యన్న కల్పించిన భరోసాయే రెండో విమర్శ. 

సేవ చేస్తామని నమ్మబలికి ప్రజలతో ఓట్లేయించుకొని తీరా వారు తమ కష్టాన్ని చెప్పుకుందామని వస్తే వారితో ఇలాగా ప్రవర్తించేదీ…? పిల్లల చదువుకో…పెళ్లికో… ఇల్లు కట్టుకోవడానికో ఉపయోగపడతాయని అగ్రిగోల్డ్ లో డబ్బులు కట్టిన వారిని అన్నన్ని మాటలు అనొచ్చా…? అప్పుడు చంద్రబాబు అండగా ఎందుకు ఉండాలి అని వాదించిన మీరు ఇప్పుడు జగన్ అదే కారణంతో విమర్శించే అర్హతుందా…? చెప్పండి అయ్యన్న గారూ…! కానీ, జగన్ నాకేం సంబంధం అనకుండా తొలి బడ్జెట్లోనే రూ.1150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయించారు. ఇది కాదా భరోసా అంటే…!

కరోనా కట్టడికి ప్రభుత్వం వద్ద సరయిన ప్రణాళిక లేదు…..అయ్యన్న.

గత అసెంబ్లీ ఎన్నికల సమయం..అది నర్సీపట్నం మునిసిపాలిటీలోని ఓ వార్డు…డ్వాక్రా మహిళలను అక్కడే ఉన్న ఓ దేవాలయంలోకి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్ళాక… మీకు రూ.10,000 పసుపు కుంకుమ చెక్కులు, చీరా, గొడుగు కావాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటేస్తామని దేవుడి ముందు ప్రమాణం చేయండి అన్నారు. చేసేదేం లేక మహిళలు ప్రమాణం చేశారు. వెంటనే గుడి పక్కనే ఉన్న అయ్యన్న చిన్న కుమారుడు  రాజేష్ వచ్చి చెక్కులు పంపిణీ చేశారు…! అంతేకాకుండా అయ్యన్న, ఆయన భార్య పద్మావతి, పెద్ద కుమారుడు విజయ్ లు నియోజకర్గంలో తిరుగుతూ చంద్రబాబు రూ.10000 ఇస్తున్నాడు…మా వాటగా చీరలు, గొడుగులు ఇస్తున్నాం అంటూ ప్రచారం చేశారు.

చూశారు గా ఎన్నికల్లో నెగ్గేందుకు అయ్యన్నపాత్రుడు ఎంత ప్రణాళిక ప్రకారం ముందుకు పోయారో…కానీ దురదృష్టవశాత్తు ఆయన పాచిక పారక ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.

విశాఖలో 17,000 ఎకరాలు కబ్జా… అయ్యన్న

సొంత జిల్లాలో ఆ స్థాయిలో భూములు అన్యాక్రాంతం అవుతుంటే అప్పట్లో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఏంచేస్తున్నట్లు. హాయిగా అందరూ నచ్చిన కాడకి దోచుకున్నాక కొందరితో వచ్చిన వ్యక్తిగత విభేదాల వల్ల భూ కబ్జాలంటూ పెద్దగా అరవడం మినహా…అయ్యన్న ఏమీ చేయలేదు. పోనీ అయ్యన్న దృష్టిలో అత్యంత సమర్థుడైన చంద్రబాబు.. ఒక్క భకబ్జా దారుడినైనా కటకటాల్లోకి నెట్టడా అంటే అదీ లేదాయే…! ఐనా ఇప్పటికీ మా బాబే బెస్ట్ సీఎం…నేనే బెస్ట్ మినిస్టర్ అన్నట్టు వ్యవరిస్తున్నారు అయ్యన్న…!