iDreamPost
iDreamPost
ఇంకో ముప్పై గంటల్లో విడుదల కాబోతున్న అవతార్ ది వే అఫ్ వాటర్స్ కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పన్నెండేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల, నిన్న ముంబై ఐమ్యాక్స్ నుంచి వచ్చిన ప్రీమియర్ రిపోర్ట్స్ కొంత టెన్షన్ కలిగించేలా ఉన్నాయి. ఒక వర్గం విజువల్ ఫీస్ట్ సర్టిఫికెట్ ఇస్తుండగా మరో బృందం ఆశించిన స్థాయిలో లేదని చాలా ఎక్స్ పెక్ట్ చేశామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందరూ మూకుమ్మడిగా 3 గంటల 12 నిమిషాల నిడివి ఇబ్బందిగా మారిందనే చెబుతున్నారు. చివరి అరవై నిముషాలు మాత్రమే గూస్ బంప్స్ కంటెంట్ ఉందనేది ఫీడ్ బ్యాక్
ఇప్పుడీ రివ్యూల మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అన్ని దేశాల్లో ఒకేసారి షోలు మొదలుపెట్టాలన్న నిర్ణయం తీసుకోకపోవడంతో ఇబ్బంది వచ్చి పడింది. టెలిగ్రాఫ్ లాంటి అంతర్జాతీయ మీడియాలో రెండు రేటింగ్స్ రావడం బట్టే పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్ధమవుతోంది. అయితే ఇప్పుడే ఒక కంక్లూజన్ కు రావడం తొందరపాటే అవుతుంది. ఏమో మన ఆడియన్స్ కి నచ్చవచ్చేమో. అసలే దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ షేర్ వస్తుందని ట్రేడ్ జోస్యం చెబుతోంది. ముఖ్యంగా నైజామ్ బుకింగ్స్ దానికి తగ్గట్టే యమా స్పీడ్ గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిందా వారం రోజులు అవతార్ 2కి నాన్ స్టాప్ పండగే
జేమ్స్ క్యామరూన్ ప్రస్తుతానికి మూడు భాగాలు సిద్ధం చేశారు. ఒకవేళ ఇప్పుడీ అవతార్ 2 ఫ్లాప్ అయినా యావరేజ్ అనిపించుకున్నా మూడో భాగాన్ని రిలీజ్ చేసి అక్కడితో ఆపేస్తారు. ముందే స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న నాలుగు అయిదు సీక్వెల్స్ సెట్స్ పైకి వెళ్లవు. ఆయన అలా అన్నారంటే ఏ మూలో అనుమానం ఉందేమో. ప్రపంచవ్యాప్తంగా 52 వేల స్క్రీన్లలో రిలీజ్ కానున్న అవతార్ 2 వసూళ్ల లక్ష్యం అక్షరాలా 16 వేల కోట్లు. ఇందులో ఒక్క లక్ష తగ్గినా ఫ్లాప్ కిందకే వస్తుంది. దశాబ్దానికి పైగా తన జీవితాన్ని అంకితం చేసిన క్యామరూన్ కల ఎంతమేరకు నెరవేరనుందో శుక్రవారానికి తేలనుంది. ఏపి తెలంగాణలో తెల్లవారు 6 గంటల నుంచే ప్రీమియర్లు స్టార్ట్ కాబోతున్నాయి