iDreamPost
iDreamPost
జేమ్స్ క్యామరూన్ కలల దృశ్యకావ్యం అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కోరుకున్న లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. 2022 వరల్డ్ వైడ్ టాప్ గ్రాసర్ గా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 21 రోజులకు 1516 బిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది. మన కరెన్సీలో 12 వేల 505 కోట్లు. నిన్నటి దాకా ఈ ప్లేస్ లో టాప్ గన్ మావారిక్ ఉండగా అవతార్ దాన్ని సులభంగా అది కూడా తక్కువ టైంలో ఓవర్ టేక్ చేసింది. దానికి వచ్చిన మొత్తం 11,548 కోట్లు అది కూడా ఫుల్ రన్ లో. అమెరికా కాకుండా బయట దేశాల్లోనే అవతార్ 2 మొత్తం కలిపి 8 వేల 660 కోట్ల దాకా వసూలు చేయడం గమనార్హం. దీని వల్ల హాలీవుడ్ టాప్ 10 గ్రాసర్ లిస్టు అవతార్ 2 గర్వంగా చేరింది
అలా అని ఇదేమి సేఫ్ జోన్ లో ఉన్నట్టు కాదు. నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారం లాభాలు రావాలంటే ఇంకో 6 వేల కోట్ల దాకా వసూలు కావాలి. ఇండియా లాంటి దేశాల్లో ఆల్రెడీ రన్ నెమ్మదైపోయింది. ప్రాంతాల వారిగా కొత్త రిలీజులు ఉండటంతో థియేటర్లు తగ్గిపోతున్నాయి. అందులోనూ ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ కి మూడు వారాల కన్నా ఎక్కువ రన్ ఉండదు. సిటీస్ లో కనీసం నెలరోజులకు పైగానే అవకాశం ఉన్నప్పటికీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల తాకిడి వల్ల అవతార్ 2కి కౌంట్ తగ్గిపోనుంది. చైనాలో దూకుడు బాగుంది. నాలుగో వారంలో అడుగుపెట్టేనాటికి అవతార్ అక్కడ 1390 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది
తర్వాత స్థానంలో ఫ్రాన్స్ 792 కోట్లు, కొరియా 645 కోట్లు తర్వాత స్థానాలు తీసుకున్నాయి. క్యామరూన్ ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే అవతార్ 3 కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. రిలీజ్ కు ఇంకా రెండు సంవత్సరాల టైం ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా ఎక్కువ సమయం అవసరం ఉండటంతో తొమ్మిది గంటల ఫుటేజ్ కి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇది విడుదలయ్యే టైంకి బడ్జెట్ తో కలిపి టార్గెట్ పాతిక వేల కోట్లకు పైగానే ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరి నాలుగు అయిదు భాగాలు తీస్తారో లేదో ఆయన ఇంకా డిసైడ్ చేసుకోలేదు. దాదాపు తీయడం కన్ఫర్మేనని ఇంగ్లీష్ మీడియా టాక్