iDreamPost
android-app
ios-app

ఆ సినిమాలకు అక్కడ కూడా నో

  • Published Apr 23, 2021 | 7:40 AM Updated Updated Apr 23, 2021 | 7:40 AM
ఆ సినిమాలకు అక్కడ కూడా నో

నిర్మాతలకు ఒకప్పుడు థియేటర్ తర్వాత శాటిలైట్ కల్పతరువుగా ఉండేది. ఎప్పుడైతే ఓటిటి వచ్చిందో అప్పటి నుంచి హక్కుల విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా టీవీ వరల్డ్ ప్రీమియర్లకు మునుపటి స్థాయిలో క్రేజ్ లేదని అర్థమవుతోంది. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్స్ తప్ప మిగిలినవాటిని జనం లైట్ తీసుకుంటున్నారు. అదే పనిగా యాడ్స్ ని భరిస్తూ యావరేజ్ మూవీస్ ని గంటల తరబడి చూసేందుకు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడిన వాటికి రేటింగ్స్ కూడా పెద్దగా రావడం లేదు. దీనికి ఇటీవలే జరిగిన రెండు టెలికాస్ట్ ల గురించి చెప్పుకోవచ్చు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచుకోవాలని ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన రెడ్ వసూళ్ల పరంగా మరీ గొప్ప ఫలితాన్ని అందుకోలేకపోయింది. సంక్రాంతి సీజన్ పుణ్యమాని సేఫ్ అయ్యింది కానీ లేదంటే ఫ్లాప్ కు దగ్గరగా వెళ్ళేది. ఇటీవలే దీన్ని టీవీలో టెలికాస్ట్ చేశారు. జెమిని ఛానల్ గట్టి ఆశలే పెట్టుకుంది. తీరా చూస్తే వచ్చిన టిఆర్పి 5 మాత్రమే. చాలా రోజుల క్రితమే సన్ నెక్స్ట్ యాప్ లో స్ట్రీమింగ్ చేయడం కూడా కొంత ప్రభావాన్ని చూపించింది. అల్లరి నరేష్ బంగారు బుల్లోడు మరీ అన్యాయంగా 2.4 తెచ్చుకుంది. ఇమేజ్ ఉన్న హీరో నటించిన ఇంత కొత్త సినిమాకు ఇలా పూర్ రెస్పాన్స్ రావడం విచిత్రమే.

అనూహ్యంగా క్రాక్ సెకండ్ టెలికాస్ట్ కు 7.5 రేటింగ్ రాగా అయిదో సారి వచ్చిన సరిలేరు నీకెవ్వరు 6.4 సాధించింది. ఫ్లాపయిన కొత్త సినిమాల కన్నా బ్లాక్ బస్టర్లు పాతవే ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే ఈజీగా రెండు బటన్లు నొక్కితే ఓటిటిలో మనకు కావాల్సిన టైంలో సినిమాలు చూసే వెసులుబాటు ఉన్నప్పుడు అదే పనిగా టీవీ సెట్ల ముందు ఓపిగ్గా కూర్చోవడం ఇప్పటి ట్రెండ్ కాదు. ఒకవేళ ఓటిటి లేకపోయి ఉంటే ఛానల్స్ కి కొత్త సినిమాలు బంగారు బాతులా ఉండేవి. కానీ ఇప్పుడా ఛాన్స్ తగ్గిపోయింది. వీలైనంత త్వరగా వేసుకుంటే తప్ప జనం చూడరని క్లారిటీ వచ్చేసింది