Idream media
Idream media
సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగ్ ల ప్రభావం గట్టిగా ఉంది అంటూ ఓ సినిమాలో మహేశ్ బాబు చెప్తాడు.. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో సినిమాల ప్రభావం కూడా గట్టిగానే ఉందని అర్ధమవుతోంది.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఘటన శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోదనను సినిమాను పోలిఉంది. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా ఉన్న శ్రీకాంత్ రాజకీయ నాయకుడి వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అందుకే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు.. టికెట్ వస్తుంది. ప్రత్యర్థిపై గెలిచేందుకు తనపై తానే హత్యాప్రయత్నం చేయించుకుంటాడు. ఒక కిరాయి హంతకుడిని పిలిచి తనను ఎక్కడ పొడిస్తే చచ్చిపోతానో అక్కడ కాకుండా ఎక్కడైనా పొడిచేయమని చెప్తాడు.. అనుకున్న విధంగానే శ్రీకాంత్ పై కత్తిపోట్లు దిగుతాయి. ప్రత్యర్థి జైలుకి వెళతాడు. శ్రీకాంత్ అసెంబ్లీ కి వెళతాడు. ఇంచు మించు ఈ తరహా ఘటనే తమిళనాడులో జరిగింది. అయితే ఇతని ప్లాన్ బెడిసికొట్టింది. అనుకున్న పధవి రాలేదు సరికదా.. దొరికిపోయి పరువు పోగొట్టుకుని ఊచలు లెక్కపెడుతున్నాడు.
పార్టీలో ఉన్నత పదవి పొందడం కోసం కత్తితో పొడిపించుకుని తనపై హత్యాప్రయత్నం జరింగిందంటూ నాటకమాడిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పూరు దగ్గరి కనక్కం పాళయంలో ఉండే 45ఏళ్ల నందగోపాల్ ఎలక్ట్రికల్ సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. హిందూమున్నాని జిల్లా శాఖ డిప్యూటీ కార్యదర్శిగాను పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం రాత్రి వ్యాపార దుకాణాన్ని మూసివేసి నందగోపాల్ మోటర్ సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా ఆరుగురు గుర్తు తెలియని దుండగులు తనపై కత్తులతో దాడిచేసి పారిపోయారని కత్తిపోటు గాయాలతో తిరుప్పూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు.
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆందోళనలకు ప్లాన్ చేసాడు. తిరుప్పూరు హిందూ మున్నాని నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నందగోపాల్ పై హత్యా ప్రయాత్నానికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. నందగోపాల్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఎదుట భారీసంఖ్యలో గుమికూడారు. వెంటనే పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ముందుగా నందగోపాల్ తనపై దాడి జరిగిందని చెప్తున్న ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కానీ ఆయనపై దాడి చేస్తున్నట్టుగా ఆ పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ కాలేదు. ఎటువంటి క్లూ కూడా దొరకలేదు.
దాంతో ప్రత్యేక పోలీసు దళాలు రంగంలోకి దిగాయి. కేసును చాలెంజింగ్ గా తీసుకుని దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణ జరుపుతున్న సమయంలో 21ఏళ్ల వయసున్న నంద గోపాల్ కార్ డ్రైవర్ తిరుప్పూరు తహసీల్దార్ ఎదుట లొంగిపోయాడు. రుద్రమూర్తి చెప్పిన విషయాలు తెలుసుకుని తహసీల్దార్, పోలీసులు షాక్ కి గురయ్యారు. నందగోపాల్ పార్టీలో కీలక పదవిని పొందాలనుకున్నాడని, అందుకే పార్టీ అధిష్ఠానానికి తనపై సానుభూతి కలిగేలా హత్యాయత్నం జరిగినట్టు నాటకమాడారని, ఆ నాటకానికి తనను పావుగా ఉపయోగించుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. నందగోపాల్ సూచనమేరకు తానే కత్తితో ఆయన వీపుపై దాడి చేశానన్నారు. ఆ తర్వాత నందగోపాల్ కత్తితో తన రెండు చేతులను కోసుకుని రక్తం కారుతుండగానే ఆస్పత్రిలో చేరాడన్నారు. కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందగోపాల్‌ను అరెస్టు చేశారు. లొంగిపోయిన కారు డ్రైవర్ రుద్రమూర్తిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.
ఈ తరహా ఘటన రెండేళ్లక్రితం తెలంగాణలోనూ జరిగింది. దివంగత మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కూడా తనపై సానుభూతికోసం, రాజకీయంగా ఫేమ్ కోసం తనపై తానే కాల్పులు జరిపించుకున్నారు. సుపారీ గ్యాంగ్ తో ప్లాన్ చేసుకుని, షార్ప్ షూటర్ ని ఎంపిక చేసుకుని కాల్పులకు పథకం వేసుకున్నాడు. ఎక్కడ జరపాలి, శరీరంపై ఎక్కడ గాయపర్చాలనే విషయమై ట్రయల్ రన్ చేసుకుని కాల్పుల తర్వాత వాళ్లు పారిపోవడానికి సీసీ కెమెరాలు లేని రూట్ మ్యాప్ కూడా చూపించారు. అనంతరం విచారణ చేసిన పోలీసులు సుపారీ గ్యాంగ్ లోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎ1గా విక్రమ్ గౌడ్, ఎ2 గా ఇండోర్ కు చెందిన షూటర్, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు మరో ముగ్గురు నిందితులపై 120,120 బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ లబ్ధికోసం నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేయడం, ఎన్నికల సమయంలో దాడులు, దౌర్జన్యాలు చేయించడం, ప్రచారంలో వైవిధ్యతను ప్రదర్శించడం నిత్యం చూస్తూనే ఉంటాం.. కానీ ఏకంగా తమపైనే హత్యా ప్రయత్నాలు వంటివి చేయించుకుంటున్నారంటే వారి పొలిటికల్ పిచ్చి పరాకాష్టకు చేరుతుందనే చెప్పుకోవాలి.