iDreamPost
iDreamPost
తెలుగులో ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల నిర్మాణం ఊపందుకుంది. జీ5 నుంచి వచ్చిన గాడ్స్ అఫ్ ధర్మపురి, రెక్కీ లాంటివి మంచి విజయం సాధించడంతో తాజాగా ఏటిఎంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దీనికి హరీష్ శంకర్ కథను అందించడం ఒక విశేషమైతే దిల్ రాజు సమర్పకుడిగా స్మాల్ స్క్రీన్ డెబ్యూ ఇదే కావడం మరో ప్రత్యేకత. సి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ప్రమోషన్లు గట్రా గట్టిగానే చేశారు. ట్రైలర్ చూశాక సినిమా రేంజ్ కంటెంట్ ఉందని అర్థమైపోవడంతో ఆడియన్స్ బాగానే ఆసక్తి చూపించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో కలిపి సుమారు నాలుగు గంటల నిడివితో రూపొందిన ఈ క్రైం థ్రిల్లర్ డ్రామా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
హైదరాబాద్ బస్తీలో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్టపోసుకునే గ్యాంగ్ జగన్(విజె సన్నీ)ది. ఓసారి కొట్టేసిన కారుని వేరొకరికి అమ్మేశాక అందులో పది కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్న సంగతి తెలుస్తుంది. వాటి ఓనర్ జగన్ ముఠా మెడ మీద కత్తి పెట్టడంతో పది రోజుల్లో ఆ డబ్బును తెచ్చి ఇస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి బయట పడతాడు. దీని కోసం ఏటిఎంలో డబ్బులు నింపే వ్యాన్ లూటీ చేస్తే అందులో పాతిక కోట్లు ఉంటాయి. ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన ఏసిపి హెగ్డే(సుబ్బరాజు) వేటను తీవ్రతరం చేస్తాడు. అసలు ఈ దోపిడీలకు ఒకదానితో మరొకటి ఉన్న కనెక్షన్ ఏమిటి, చివరి ఏమయ్యింది తెలియాలంటే సిరీస్ చూడాలి
బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ ఊర మాస్ క్యారెక్టర్ లో మెప్పించాడు. రాయల్ శ్రీ, సుబ్బరాజులు గుర్తుంటారు. భారీకాయంతో పోలీస్ గా దివ్యవాణి వెరైటీగా అనిపించినా అంతగా అతకలేదు. హరీష్ శంకర్ ఇచ్చిన స్టోరీలో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ మొదటి నాలుగు ఎపిసోడ్లలో అవసరం లేని మ్యాటర్ చాలా ఉండటంతో బోర్ కొడుతుంది. తర్వాత నుంచి వేగమందుకుంటుంది. చంద్రమోహన్ లో మంచి సాంకేతిక ప్రతిభ అతని టేకింగ్ లో కనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే మీద ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే మనీ హీస్ట్ కాన్సెప్ట్స్ లో ఇది ఇంకా కొత్తగా అనిపించేది. ఎంత సిరీస్ అయినా మరీ ఇంత ల్యాగ్ అక్కర్లేదు. అప్పుడప్పుడూ ఫార్వార్డ్ ఆప్షన్ కి పని చెబుతూ రాబరీ జానర్ ని ఇష్టపడేవాళ్లు ఏటిఎంని ఓసారి ట్రై చేయొచ్చు