iDreamPost
android-app
ios-app

Atchannaidu, TDP – అంత సీన్‌ లేదన్న అచ్చెన్న ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి..?

  • Published Nov 30, 2021 | 4:33 PM Updated Updated Nov 30, 2021 | 4:33 PM
Atchannaidu, TDP – అంత సీన్‌ లేదన్న అచ్చెన్న ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి..?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఈ విషయం వైఎస్సార్‌ సీపీ గుర్తుంచుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ లేదు.. అధికారంలోకి వచ్చే సీనూ లేదు అని తెలుగుదేశం దుస్థితిపై ఇటీవల ఘాటైన పదజాలంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీకి కౌంట్ డౌన్ మొదలైందని, ఇక వారి అరాచకాలు సాగవని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యవహార శైలిని ఉద్దేశించి, పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అది నిజమే సుమా అన్నట్టు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ చతికిల పడింది. కొన్ని ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికే ముందుకు రాలేదు. తాజాగా పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా వరుస ఎన్నికల్లో పరాజయాలను ఎదుర్కొంటున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలిచేస్తుందన్న ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. ఇంతలో టీడీపీ ఎప్పుడు బలపడిందని అడుగుతున్నారు. పార్టీ పటిష్టానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధినేత మొదలు మొత్తం నేతలంతా ప్రకటనలకు పరిమితమైతే టీడీపీ బలపడుతుందా? అని అంటున్నారు. పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతలు వలసపోకుండా అడ్డుకట్ట వేయాలని, భవిష్యత్తుపై కేడర్‌కు భరోసా కల్పించాలని కోరుతున్నారు.

దౌర్జన్యాలు, అరాచకాలకు జనం ఓట్లేస్తారా?

ఈ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే తప్ప చేసిన అభివృద్ది శూన్యమని అచ్చెన్న విమర్శించారు. అచ్చెన్న చెబుతున్నట్టు రెండున్నరేళ్లలో అధికార పార్టీ అన్ని దుశ్చర్యలకు పాల్పడితే పదే పదే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి జనం ఎందుకు ఓట్లేస్తారు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. వైఎస్సార్‌ సీపీ అరాచకాలు అనేది టీడీపీ నేతల మాటల్లోనూ, ప్రకటనల్లోనే తప్ప అది నిజం కాదని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇలాంటి ప్రకటనలతో జనాన్ని ఎలాగైనా నమ్మించేద్దామన్న తాపత్రయం తప్ప వైఎస్సార్‌ సీపీకి జనంలో వ్యతిరేకత లేదన్న సంగతి టీడీపీ నాయకులకు తెలుసు. కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా క్యాడర్‌లో జోష్‌ నింపడానికి, పార్టీ నుంచి వలసలను అరికట్టడానికి అధికారంలో వచ్చేస్తున్నాం అంటూ తరచుగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదో ఒక ఘటనను పట్టుకొని రాష్టం మొత్తానికి ఆపాదిస్తారా?

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న చెప్పారు. మహిళా  హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను పట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తూ ప్రకటనలు చేయడం, రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం టీడీపీ నేతల వైఖరిగా మారిపోయింది. జరిగిన ఘటనలో తమకు అనుకూలంగా ఉన్న అంశాన్ని తీసుకుని రాద్ధాంతం చేయడం అలావాటైపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గంలో అయినా, మరోచోట అయినా అరాచకాన్ని ప్రభుత్వం సహించదు. చర్యలు తీసుకుంటుంది.  ఈ లోపు మేం అధికారంలోకి వచ్చేస్తాం.. అంతు చూసేస్తాం అంటూ అర్థం లేని ప్రకటనలు చేయడం ఎవరి మెప్పు పొందడానికో అచ్చెన్నే చెప్పాలి.

Also Read : Mandapeta – ఊగిసలాటలో మరో ఎమ్మెల్యే