Idream media
Idream media
పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాం నుంచే దాగుడుమూతలు మొదలయ్యాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎన్నికలు వాయిదా వేశారు.. వద్దంటే ఎన్నికలన్నారు. మొదట్లో ప్రభుత్వం ఎన్నికలు వద్దంటే నాటి ఎస్ ఈసీ సహా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలిసిందే. ఎన్నికలు పెట్టి తీరాల్సిందేనని పట్టుబట్టారు. కరోనా కేసులు నమోదు అవుతున్న తరుణంలో సరికాదని ప్రభుత్వం పేర్కొంటే, ఎన్నికలంటే భయమని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే జగన్ సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తూ వచ్చారు. అప్పుడు ఎన్నికలు పెట్టమని కోర్టులకెళ్లారు.
చివరకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. దీంతో ప్రజల్లో ఎవరిపై వ్యరేతికత ఉందో తేలిపోయింది. దీంతో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చేయలేకపోయింది టీడీపీ. ఎన్నికల్లో పోటీచేయకపోగా, ఎన్నికలు జరిగాక వాటిని రద్దు చేయాలంటూ కోర్టుకెక్కింది. కొన్ని రోజులుగా వాదనలు కొనసాగాయి. చివరకు ఎన్నికలు రద్దు చేయాలంటూ తీర్పు వెలువడింది. దీంతో టీడీపీ నాయకులు నోళ్లు మళ్లీ లేవడం మొదలుపెట్టాయి. గతంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం అన్నప్పుడు ఎలా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోల చేశారో, ఇప్పుడు కూడా అందే పంథా అవలంబిస్తున్నారు. ఒక వేళ పరిషత్ ఎన్నికలు మళ్లీ పెడితే టీడీపీ పోటీ చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ పోటీ చేస్తే ఓడిపోతుందనడంలో సందేహం లేదు. గత అనుభవాలు అదే తెలియజేస్తున్నాయి.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా కోర్టు తీర్పు అనంతరం టీడీపీ లోలోపలే సంతోషపడితే సరిపోయేది. కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లైవ్ లోకి వచ్చి, ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అని, జగన్ ఇప్పటికైనా మారాలని.. ఇలా ఎన్నికల్లో గెలిచినంత సంబరంగా ఏవేవో మాట్లాడారు. దీనిపై టీడీపీ శ్రేణులే అవాక్కు అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అంత సీన్ అవసరమా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికలు మళ్లీ జరగక తప్పదు. ఈసారి తప్పకుండా పోటీ చేయాల్సిన పరిస్థితి. పోటీ చేస్తే ఓటమి తప్పదు. ఎందుకంటే, జగన్ సర్కార్ పై ప్రజల్లో మైలేజీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మనం ఎలాగూ ఓడిపోయే ఎన్నికలు పెడితే ఏంటి, ఆగితే ఏంటి అని సైలెన్స్ గా ఉండాల్సింది పోయి, కోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని హడావిడి చేయడం మంచిది కాదనే అభిప్రాయాలను పలువురు వెలిబుచ్చుతున్నారు.
పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అంటే సగం స్థానాలను వైసీపీ గెలిచినట్లే. అన్నీ తెలుసు కూడా అచ్చెన్న హడావిడి చేయడం ఉద్దేశం ఏంటో?