Krishna Kowshik
Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఓటర్లను గాలం వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు, ఆభరణాలు, పట్టు చీరలు, వస్తువులు తరలివెళుతున్నాయి. అయితే ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నోటీఫికేషన్ విడుదల కాకుండానే ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు పట్టుబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటి మొన్న మియాపూర్ లో 27 కేజీల బంగారం, 15 కేజీల వెండి ఆభరణాలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే ఓ వ్యక్తి నుండి రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు పట్టుకున్న మొత్తం విలువ రూ. 165.81 కోట్లు అని తేలింది. ఇదిలా ఉంటే.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. భారీగా నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 2.25కోట్ల విలువ చేసే పట్టు చీరలను పోలీసులను పట్టుకున్నారు. పంచవటి అపార్ట్ మెంట్‌లో రెండు లారీల్లో పట్టు చీరలను తీసుకు వచ్చి డంప్ చేస్తున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ కు సమాచారం అందడంతో పోలీసులకు తెలిపారు. వాళ్లు వెళ్లే సమయానికే 400 బ్యాగుల్లో ఉన్న చీరలను ఓ డబుల్ బెడ్ రూం ఇంట్లో డంప్ చేశారు. అధికారులు అక్కడకు చేరుకుని చీరలను పరిశీలించారు. చీరలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో చీరల లోడ్‌తో ఉన్న లారీలను సీజ్ చేశారు.
అపార్ట్ మెంట్ అసోషియేషన్ ఆఫీస్ రూంలో మరో 343 బ్యాగుల్లో చీరలను ఉంచారు. ఈ మొత్తం సరుకు విలువ రూ. 2 కోట్లు ఉన్నట్లు సమాచారం. లారీలతో సహా చీరలను బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సూర్యాపేట పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 130 కిలలో వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కుచెందిన వ్యాపారి ఉత్తమ్ కుమార్ ఎలాంటి ఆధారాలు లేకుండా అలంకార్ టాకీస్ రోడ్డులోని ఓ సింగిల్ బెడ్ రూం ఇంట్లో 130 కిలోల వెండిని డంప్ చేశాడు. సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేయగా.. వెండి వస్తువులు కనిపించాయి. వీటి విలువ కోటి రూపాయలని పోలీసులు వెల్లడించారు. వాటిని సీజ్ చేసి.. విచారణ చేపడుతున్నారు.