Idream media
Idream media
హిచ్‌కాక్‌తో సమస్య ఏమిటంటే అన్ని రకాల సైకో థ్రిలర్స్ 50 ఏళ్ల క్రితమే తీసిపడేశాడు. ఇపుడు కొత్త డైరెక్టర్లు చేయాల్సింది ఏమంటే హిచ్‌కాక్ చెప్పుల్లో కాళ్లు పెట్టి సరిగా నడవడమే. మన వాళ్లకి అది కూడా సరిగా రాక తడబడుతూ కిందపడుతుంటారు.
అశ్వథ్థామా సినిమాలో ఇదే సమస్య. సైకో థ్రిల్లర్ తీయాలనుకున్నప్పుడు అనేక సంఘటనలైనా జరగాలి. లేదా ఒక సంఘటన అయినా ఊపిరాడని రీతిలో జరగాలి. హిచ్‌కాక్ ఏమంటాడంటే విలన్ బలంగా ఉంటే, సినిమాలో కూడా బలం ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చిన విలన్ ఏదో పొడిచేస్తాడనుకుంటే, హీరో చేతిలో చచ్చిపోతాడంతే.
ఈ సినిమా సైకో థ్రిల్లర్. ఈ జానర్ గురించి ప్రపంచంలో ఎవరు మాట్లాడినా హిచ్‌కాక్ గురించి మాట్లాడాల్సిందే. సైకో సినిమాలోని దృశ్యాలను ఎవడూ అంత సులభంగా మరిచిపోలేడు. మరి అశ్వథ్థామ సంగతి ఏంటి అంటే ఇది కూడా మనకు గుర్తుంటుంది. Bad Attempt గా.
నాగశౌర్య లవర్‌బాయ్‌గా బాగుంటాడు. కొత్త కథల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే ఈ కథను తానే రాసుకున్నాడు. ఏం రాశాడంటే ఆల్రెడీ మనం చూసేసిన కథనే రాశాడు. పోనీ స్క్రీన్ ప్లే బలంగా ఉందా అంటే ఫస్టాప్‌లో కథలోకి వెళ్లకుండా అనవసరంగా ఫ్యామిలీ ఎమోషన్స్, అన్నాచెల్లెళ్ల అనుబంధం, హీరోయిన్ ఎపిసోడ్ ఇదంతా దాదాపు అరగంట తింటుంది. చెల్లెలు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కానీ దానికి కారణం ఎవరో తెలియదు. ఇది షాకింగ్ ఎలిమెంట్.
అయితే మనం షాక్‌కు గురి కాకుండా ఫస్ట్‌లోనే ఒకమ్మాయిని కిడ్నాప్ చేసే సీన్ చూపిస్తారు. దాంతో ఇది Women Traficking
(అమ్మాయిల అక్రమ రవాణా) అనుకుంటాం. తర్వాత ఏదో మిస్టరీ ఉందని హీరోలాగే మనమూ అనుకుంటాం. వరుసగా అమ్మాయిలు మాయమవడం, తర్వాత సాయంత్రానికి ఇల్లు చేరడం.
హీరో పరిశోధన మొదలవుతుంది. ఇదంతా చాలా తెలివిగా జరిగితే OK. కానీ హీరో ఒకమ్మాయి చెప్పే మాటలు ఆధారంగా ఆమెని టీజ్ చేసిన వాళ్లని , ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్టిన వాళ్లని చితకబాదుతూ ఉంటాడు.
ఎవర్రా నువ్వు అని అరుస్తూ వాళ్లు తన్నులు తింటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఒక కొత్త క్లూ దొరుకుతూ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. అంతే కానీ ఎందరిని కొట్టినా కొత్త విషయం తెలియకుండా ఇంటర్వెల్ పాయింట్ వరకూ వచ్చేస్తారు. అయితే అంబులెన్స్‌లో వెళుతున్న నలుగురు రౌడీలను ఛేజ్ చేయడం , గణేష్ నిమజ్జనంలో ఫైట్ ఇవి సినిమాలో హైలైట్. ఇలాంటి సీన్స్ ఇంకో రెండు పడితే సినిమా లేచి నిలబడేది.
అయితే డైరెక్టర్ రమణతేజకి గందరగోళం ఎక్కువై సెకండాఫ్ రొటీన్‌లోకి వెళ్లిపోయాడు. థ్రిల్లర్‌లో మెసేజ్ ఇవ్వడానికి అనవసర ప్రయత్నం చేశాడు. బంగినపల్లి మామిడి పండు తింటున్నప్పుడు, ఆవకాయ నంజుకో కూడదు. రెండూ మామిడి పండే అనే లాజిక్ ఇక్కడ కుదరదు.
థ్రిల్లర్ కథలు రెండు రకాలు. ఒకటి విలన్ ఎవరో లీక్ కాకుండా చివరి వరకు నడిచేవి. రెండు విలన్ ఎవరో ప్రేక్షకులకి చెప్పేసి , హీరో -విలన్ మధ్య టామ్ అండ్ జెర్రీ షో నడపడం. అయితే అశ్వథ్థామలో ఫస్టాఫ్ వరకు విలన్ తెలియదు. సెకండాఫ్‌లో తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య ఇంటెలిజెంట్ గేమ్ ఉండదు. విలన్ యాక్సిడెంటల్‌గా దొరుకుతాడు తప్ప, హీరో తెలివితేటలేం ఎస్టాబ్లిష్ కావు.
పూర్వం మనవాళ్లు నాటకాల్లో నిషిధ్దమైనవి కొన్ని సూచించారు. అంటే ప్రేక్షకుల ముందు ప్రదర్శించకూడనివి. అయితే సినిమాల్లో ఆ రూల్స్ లేవు. అంటే లోకంలో జుగుప్సాకరమైన పనులు చేసే కొందరు మానసిక రోగులు ఉంటారు. వాళ్ల మీద సినిమా తీయాలనుకుంటే వాళ్లెందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో చెప్పగలగాలి. అప్పుడు అది ఇంకో కథ అవుతుంది. ఈ సినిమాలో విలన్ అట్లా ఎందుకు ప్రవర్తిస్తాడో తెలియదు. అతని చేష్టలు స్క్రీన్ మీద చూడటం కష్టమే.
మనవాళ్లకి Surprise కి, Suspense కి తేడా తెలియదంటాడు హిచ్‌కాక్. ఒక హాల్లో అందరూ మాట్లాడుకుంటుండగా బాంబు పేలితే అది ప్రేక్షకులకి ఆశ్చర్యం.
బాంబు ఉందని ప్రేక్షకులకి తెలుసు. హాల్లో ఉన్నవాళ్లకి తెలియదు. గడియారం ముల్లు కదులుతూ ఉంటే ప్రేక్షకుల్లో కలిగేది సస్పెన్స్.
ఈ సినిమాలో ఇవి రెండూ లేవు. ఇది ప్రధాన లోపం.
సిటీలో అమ్మాయిలు మాయమవుతున్నారు. వాళ్లకి తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఎలా జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? ఈ ఒక్క పాయింట్ నచ్చేసి నాగశౌర్య కథ రాసేస్తే , దాన్ని రెండు గంటలకు పైగా స్క్రీన్ మీద నడపాలంటే మాటలా?
సినిమాలో చాలా మంది యాక్టర్లు ఉన్నప్పటికీ వాళ్లెవరూ కథలో భాగంగా ఉండరు. హీరోయిన్ కూడా ఏదో హీరో అసిస్టెంట్‌లా ఉండాలంటే ఉంది. ఆ పని ఏదో సత్య చేసినా కాస్త కామెడీ పండేది.
మన హీరోలకి రెండు రకాల బలహీనతలు చుట్టుకున్నాయి. సినిమా అంతా తమ భుజాల మీదే నడవాలని. వేరే ఇంకెవరికీ ప్రాముఖ్యత ఉండని స్థితి చాలా సినిమాల్లో కనిపిస్తుంది. రెండోది తెల్లారేసరికి మాస్ హీరో అయిపోవాలని. నాగశౌర్య చక్కని నటుడు. కానీ సిక్స్ ప్యాక్‌లో కొట్టడానికే టైం సరిపోయింది. పైగా సొంత సినిమా, కొత్త డైరెక్టర్, అడిగే వాళ్లెవరు?
ఇదీ డిజిటల్ యుగం. అన్ని రకాల కథల్ని , అన్ని భాషల్లో జనం చూసేస్తున్నారు. వాళ్ల ఊహకి అందని విధంగా నువ్వు తెరపై చూపించలేకపోతే స్క్రీన్ మీద తలలు తెగాల్సిందే తప్ప టికెట్లు తెగవు.
అశ్వథ్థామ అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు. భారతంలో అశ్వథ్థామ ఆవేశపరుడు. మోసం చేసి తండ్రి ద్రోణున్ని చంపారని తెలిసి ఆవేశంలో నిద్రపోతున్న చిన్నపిల్లలు ఉప పాండవులను గొంతుకోసి చంపుతాడు.
కడుపు శోకంతో ద్రౌపది శాపం పెడుతుంది. చిన్నపిల్లల్ని చంపిన పాప భారంతో అతను చావులేకుండా బతకాలి. పసిబిడ్డల హంతకుడిగా అపరాధభావనతో చావుని ప్రార్థిస్తూ బతికిన వాడు అతను. మహాభారతంలోని కథ ఇది.
ద్రౌపదిని అవమానించినపుడు ప్రశ్నించిన ఏకైక వ్యక్తిగా అతన్ని ఎంచుకుని టైటిల్ సెట్ చేసి ఉంటారు. ఒక సీన్‌లో మెహరిన్ తనకేం అర్థం కాలేదు అంటుంది. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్ చేయాలి కానీ, పాత్రలు కన్ఫ్యూజన్ అయితే ఎట్లా? సినిమా కథ మహాసముద్రంలాంటిది. లోతు దొరకడం కష్టం. హాయిగా హీరోగా యాక్ట్ చేయకుండా నాగశౌర్యకు కథల గోల ఎందుకు? దానికి ఇండస్ట్రీలో వేరే ఉన్నారు కదా!
డబ్బు బాగా ఖర్చు పెట్టినా ఫలితం ఎందుకు రాలేదంటే చూడిగేదెకి గడ్డి పెడితే పాలు ఇస్తుంది. కానీ గొడ్డు గేదెకి ఎంత పెట్టినా వేస్ట్. పాతకథకి పాత స్క్రీన్ ప్లే!
చివర్లో హిచ్‌కాక్ గురించి ఇంకో మాట
రియల్ లైఫ్‌లో మర్డర్లు ఈజీగా చేసేస్తారు కానీ సినిమాల్లో చూపించాలంటే రక్తమంతా చూపించాలి. డైరెక్టర్‌కి ఇది చచ్చే చావు.
అశ్వథ్థామ సైకోథిల్లరే కానీ, పాపం సుసైడ్ చేసుకుంది!