ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గత సమావేశాల్లో స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోనున్నారు. అధికార పార్టీని వ్యతిరేకించడమే ఏకైక లక్ష్యంగా సమావేశాల్లో దుందుడుకుగా వ్యవహరించిన ఎమ్మెల్యేల పట్ల చర్యలకు సిద్ధమైంది ప్రివిలేజ్ కమిటీ. అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరుపై చర్చించిన సభా హక్కుల కమిటీ టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభా హక్కుల కమిటీ సమావేశమైంది. టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చర్చించిన ఏడుగురు సభ్యుల కమిటీ వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అనుచితంగా ప్రవర్తించడంతో సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని గతంలో స్పీకర్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని సభా హక్కుల కమిటీ బుధవారం ప్రాథమికంగా సమావేశమైంది. కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, అప్పలనాయుడు, వర ప్రసాద్, కన్నబాబు,చక్రపాణి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చర్చించారు. పెన్షన్ల పంపిణీపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశ్యపూర్వకంగా చర్చను తప్పుదోవ పట్టించారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. స్పీకర్ పట్ల అనుచిత పదజాలాన్ని ఉపయోగించి, స్పీకర్ స్థానాన్ని అవమానించడంపై కమిటీ చర్చించింది.
స్పీకర్ స్థానాన్ని అవమానించిన అచ్చెంనాయుడు, రామానాయుడులకు నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కమిటీ పేర్కొననుంది. కాగా… కమిటీ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శాసన సభ్యుడి హక్కులను కాపాడేందుకే తాము పనిచేస్తున్నామని కమిటీ చైర్మన్ కాకాణి తెలిపారు. స్పీకర్ రిఫర్ చేసిన అంశాలను పరిశీలించిన తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకుని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా… జనవరి 18 లేదా 19 తేదీల్లో తిరుపతిలో మరోసారి సమావేశం జరగనుంది.