iDreamPost
android-app
ios-app

కమ్యూనిస్టులతో కేసీఆర్‌ దోస్తీనా..?! అసోం సీఎం ఘాటు వ్యాఖ్యలు

కమ్యూనిస్టులతో కేసీఆర్‌ దోస్తీనా..?! అసోం సీఎం ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ బాగా ఉపయోగించుకుంటోంది. దాన్ని ఆయుధంగా చేసుకుని వరుస ఆందోళనలను కొనసాగిస్తోంది. జేపీ నడ్డా నుంచి అసోం సీఎం హిమంత విశ్వ శర్మ వరకు.. దేశ స్థాయి నుంచి గల్లీ కార్యకర్తల వరకూ బండి అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై హిమంత విశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కార్యాలయంలోకి పోలీసులు చొరబడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అత్యంత అమానుషంగా అరెస్టు చేసిన పోలీసులే ఫామ్‌ హౌస్‌లోకి చొరబడి కేసీఆర్‌ను కూడా లాక్కుపోయే రోజు ఎంతో దూరం లేదని అన్నారు.

హనుమకొండలో 317 జీవోకు, బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన సభలో హిమంత విశ్వ శర్మ తెలంగాణ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలపై కూడా మాట్లాడారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే.. పోలీసుల రాజ్యం సాగిస్తున్న కేసీఆర్‌కు కూడా పడుతుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చుని పాలిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకు జనం సిద్ధమవుతున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాశక్తి ముందు ధనబలం పని చేయదని హుజూరాబాద్‌ ఎన్నికలు రుజువు చేశాయని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతున్నారని, అలాంటి వారికి కేసీఆర్‌ విందు భోజనాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే, కనుమరుగైపోయే పార్టీలన్నీ ఒక్కదగ్గర చేరుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన కమ్యూనిస్టులతో కేసీఆర్‌ దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక సంవత్సరంలో లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సమగ్రమైన కార్యాచరణను అసోంలో తమ ప్రభుత్వం అమలు చేయబోతోందని.. ఇక్కడ సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023లో టీఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు, ఉద్యోగులే పాతర పెడతారని విశ్వ శర్మ హెచ్చరించారు.

Also Read : సీపీఎం నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం.. ఏమి జరిగింది?