Idream media
Idream media
హైదరాబాద్ లోక్ సభ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు హ్యాకర్లు గట్టి షాకిచ్చారు. దేశంలో కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రముఖ సోషల్ మీడియా ఫ్టాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా ఆయనకు ఈ ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ సెక్యూరిటీ వ్యవస్థలోని డొల్లతనాన్ని హ్యాకర్లు బయటపెట్టారు. దీనికి ఎంఐఎం అధినేత అసద్ ను పావుగా వాడుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్ దేశంలో చాలా మంది కేంద్రమంత్రులు ఉపరాష్ట్రపతి అకౌంట్ల విషయంలో దుందుడుకుగా వ్యవహరించి అభాసుపాలైంది. నిషేధం ఎదుర్కొంటుందనుకుంటున్న సమయంలో వెనక్కి తగ్గింది.
తాజాగా ఎంఐఎం అధినేత ఓవైసీపీ నేతృత్వంలోని ఎంఐఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో డిస్ ప్లే ఇమేజ్ గా ఉన్న మజ్లిస్ ఎన్నికల గుర్తు గాలిపటాన్ని తొలగించారు. డిస్ ప్లే పేరును మార్చేశారు. వాటి స్థానంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫొటో పేరును పొందుపరిచారు. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఎంఐఎం ధృవీకరించింది.
ఇదివరకు డిస్ ప్లే ఇమేజ్ గా ఉన్న పార్టీ ఎన్నికల గుర్తు గాలిపటంను ఇప్పుడు హ్యాకర్లు మార్చేశారు. దాని స్థానంలో ఎలన్ మస్క్ ఫొటో పెట్టారు. పేరును కూడా మార్చివేశారు. ఎఐఎంఐఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో రెండు మార్పులు తప్ప మరేవీ చోటుచేసుకున్నట్లు కనిపించట్లేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఫొటోలు యథాతథంగా ఉన్నాయి.ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలం అయిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అసదుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యేల ఫొటోలను హ్యాకర్లు ఏం మార్చలేదు. డిస్ ప్లే ఇమేజ్ ను పేరును మాత్రమే మార్చేశారు. దీనిపై ఎంఐఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా. లేదా? అన్నది వేచి చూడాలి.