Idream media
Idream media
తెలంగాణ ధనిక రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమనే భావన మెజార్టీ ప్రజలు, నాయకుల్లో ఉంది. కానీ.. నీతి అయోగ్ రిపోర్ట్ చూస్తే విభజిత ఏపీలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందనే విషయం స్పష్టమవుతోంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 20 స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రధానంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాలను ఆధారంగా చేసుకుని ప్రజల స్థితిగతులను తెలుసుకుంది.
వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల, కిషోర బాలల మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని నీతి ఆయోగ్ అంచనా వేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు, పేదరికపు ఛాయలను ఎత్తి చూపింది.
అల్లాడుతున్న ఆదిలాబాద్
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేదరికంలో మొదటి స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఉమ్మడి పది జిల్లాల ఆధారంగా రాష్ట్రంలో పేదరికాన్ని అంచనా వేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఎక్కువ శాతం పేదరికం తాండవిస్తోందని తెలిపింది. ఈ జిల్లాలో ఏకంగా 27.43 శాతం పేదరికం ఉంది. ఇక రెండు,మూడు స్థానాల్లో వరుసగా మహబూబ్‌నగర్ (26.11 శాతం) నిజామాబాద్ (21.44 శాతం) ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పేదరికం తక్కువగా ఉంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ 17.90 శాతం పేదరికంతో నాలుగో స్థానంలో నిలిచింది.
Also Read : జగన్ ఢిల్లీ టూర్.. కేంద్రం మదిలో ఏముంది?