iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీ చేసిన పనితో క్రికెట్‌లోకి వచ్చా: డచ్‌ క్రికెటర్‌

  • Author Soma Sekhar Published - 01:00 PM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Published - 01:00 PM, Thu - 19 October 23
విరాట్‌ కోహ్లీ చేసిన పనితో క్రికెట్‌లోకి వచ్చా: డచ్‌ క్రికెటర్‌

జీవితంలో అనుకోకుండా జరిగిన లేదా చూసిన సంఘటన ఆ వ్యక్తిని ప్రేరేపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ సంఘటన సదరు వ్యక్తిని అటువైపుగానే నడిపిస్తుంది కూడా. ఇలా ప్రేరణ పొంది.. తమ లక్ష్యాలను సాధించిన ఎందరో ప్రముఖుల జీవితాల గురించి మనం చదివే ఉన్నాం. అలా విరాట్ కోహ్లీ చేసిన ఒకే ఒక్క పనితో తాను క్రికెట్ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు నెదర్లాండ్స్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఆర్యన్ దత్. ప్రస్తుతం డచ్ టీమ్ లో కీలక ప్లేయర్ గా ఉంటూ.. జట్టు విజయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చివర్లో సిక్స్ లతో రెచ్చిపోయాడు ఆర్యన్ దత్. మరి కోహ్లీ చేసిన ఆ ఒక్కపని ఏంటి? అతడు క్రికెట్ లోకి రావడానికి అది ఎలా ప్రేరణగా నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.

అది 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. ఇండియా-శ్రీలంక జట్లు వరల్డ్ కప్ ట్రోఫీ కోసం హోరాహోరిగా తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ ను ఢిల్లీలోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూస్తున్నాడు ఓ 8 ఏళ్ల బాలుడు. ఇంతలోనే ధోని సిక్సర్ తో టీమిండియాకు వరల్డ్ కప్ ను అందించాడు. ఆ సంతోషంలో ముగినిపోయిన బాలుడు.. నాన్న నేను క్రికెట్ ఆడుతా అని అన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ భుజాలపై సచిన్ ను ఊరేగిస్తుంటే చూసి.. వెంటనే బ్యాట్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. ధోని సిక్సర్, విరాట్ భుజాలపై సచిన్ ను చూసి క్రికెట్ లోకి రావాలనుకున్న బాలుడు ఎవరో కాదు.. ప్రస్తుతం నెదర్లాండ్స్ టీమ్ లో స్టార్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్న ఆర్యన్ దత్. సఫారీ జట్టుపై సాధించిన సంచలన విజయంలో కీలకపాత్ర పోషించాడు ఆర్యన్ దత్.

అయితే విచిత్రంగా క్రికెట్ లోకి రావాలనుకున్న ఆర్యన్.. క్రికెట్ కెరీర్ కూడా విచిత్రంగానే సాగింది. అతడు ఢిల్లీలో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి.. నెదర్లాండ్స్ లో కొనసాగిద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ప్రయాణం అంత సాఫీగా సాగతేదు. అతడు ఉండే డెన్ హాగ్ లో క్రికెట్ మాటే లేదు. దీంతో బాస్కెట్ బాల్ కోర్ట్ లో తండ్రితో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇది డచ్ మాజీ క్రికెటర్ టిమ్ డీ లీడ్ చూసి అతడిని వూర్ బర్గ్ క్రికెట్ అకాడమీకి తీసుకురమ్మని చెప్పాడు. అయితే ఇక్కడే మరో సమస్య ఆర్యన్ దత్ కు ఎదురైంది.

నెదర్లాండ్స్ లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకే క్రికెట్ సీజన్ ఉండేది. దీంతో డచ్ మరో ప్లేయర్ అయిన విక్రమ్ జిత్ తో కలిసి 2015 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం ఆరు నెలలు క్రికెట్ శిక్షణ కోసం చండీగఢ్ కు వచ్చేవాడు. ఇక్కడే హర్బజన్, అశ్విన్, నాథన్ లయాన్ బౌలింగ్ చూసి తన స్పిన్ బౌలింగ్ ను మెరుగుపర్చుకున్నాడు. ఇటు బౌలింగ్ తో పాటు మంచి హిట్టింగ్ కూడా చేయగల సమర్థుడు ఆర్యన్. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రబాడ, ఎంగిడి, కోయెట్జీ లాంటి స్పీడ్ బౌలర్లలో సిక్స్ లు బాది ఔరా అనిపించాడు. మరి విరాట్ కోహ్లీ భుజాలపై సచిన్ ను చూసి క్రికెట్ లోకి వచ్చిన ఆర్యన్ దత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.