iDreamPost
android-app
ios-app

“చింతామణి” వివాదంలో న‌ర్సాపురం ఎంపీ

“చింతామణి” వివాదంలో న‌ర్సాపురం ఎంపీ

ఇరవయ్యో దశాబ్దం మూడవ దశకం నాటి చింతామ‌ణి నాట‌కం ఏపీలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. రాష్ట్రంలో ఈ నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. నాటక కళాకారుల సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ జీ.ఓ కి వ్యతిరేకంగా కోర్టులో పిల్ వేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్యవైశ్య నాయకులు రఘురామకృష్ణంరాజు చిత్రపటానికి చెప్పుల దండవేసి సత్కరించారు. ఇలా విభిన్న రూపాల్లో ర‌ఘురామ‌రాజుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నాటకంలో వైశ్య కులానికి చెందిన వారిని అనుకరిస్తూ.. హేళన చేసేలా సుబ్బిశెట్టి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక ప్రదర్శనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ చింతామణి నాటకాన్ని నిషేధించాలంటూ ఏడాది కిందటే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శతజయంతి వేడుకలపై కూడా అప్పట్లో తీవ్ర వివాదం నెలకొంది.. చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదంటూ ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడంపై కళాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నర్సాపురం ఎంపీ రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ మండిపడుతున్నారు. సుబ్బిశెట్టి పాత్రను వికృతంగా చిత్రీకరిస్తున్నారని అందుకే చింతామణి నాటకంపై నిషేధం విధించారన్నారు కార్పోరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దీనికి రఘురామ ఏంచెబుతారంటూ నిలదీశారు.

చింతామణి నాటక నిషేధాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) తక్షణం ఉపసంహరించుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామరాజును ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మహాసభ అధ్యక్షుడు  టంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘చింతామణి డ్రామా విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. ఇది ఆర్యవైశ్యులను కించపరచడమే కాదు… అనేక కులాలను, దేశ నాయకులను, ఆఖరికి దేవుళ్లను కూడా అవహేళనగా మాట్లాడే డైలాగులతో, ఈనాటి సమాజాన్ని ఆసాంతం చెడగొట్టే నటన, డ్యాన్సులతో జుగుప్స కలిగించే విధంగా వుంటుంది. అసలు కథ వేరు, ఇప్పుడు ప్రదర్శించే డ్రామా వేరు. మీరు వెంటనే న్యాయస్థానంలో వేసిన పిల్‌ను ఉప సంహరించుకోవాలని కోరుతున్నాం. లేకుంటే ఇలాంటి చర్యలతో రాజకీయంగా మీపై సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది’’ అని హెచ్చరించారు.