Idream media
Idream media
ఐపిఎల్ లో అప్పుడప్పుడు కొందరు అలా మెరుస్తూ ఉంటారు. ఐపిఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్ నుంచి నేటి వరకు కూడా ప్రతీ సీజన్ లో ఒక ఆటగాడు అలా ఒక మెరుపు మెరిసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఇన్నింగ్స్ గాని ఆ బౌలింగ్ గాని జట్టు విజయావకాశాల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనే మాట వాస్తవం. ఈ ఐపిఎల్ సీజన్ లో కూడా కొందరు ఆటగాళ్ళు మెరుస్తున్నారు. కాని వాళ్ళ ప్రదర్శన గురించి అంతగా చెప్పుకోలేకపోయినా… ఈ ఏడాది రెండో భాగం ఐపిఎల్ లో మాత్రం ఇద్దరు ఆటగాళ్ళు ఆదిలోనే తమ ముద్ర వేసారు.
మొన్నటి మ్యాచ్ లో సూపర్బ్ ఇన్నింగ్స్ తో తన జట్టుకి మంచి విజయాన్ని అందించిన చెన్నై ఓపెనర్ గైక్వాడ్… ఫాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ మ్యాచ్ లో అర్శదీప్ సింగ్ అనే కుర్ర ఆటగాడు అభిమానులను కట్టిపడేసాడు. తొలుత బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ జట్టు ఓపెనర్లు లేవిస్, జైస్వాల్ ధాటికి మంచి స్కోర్ నమోదు చేసింది. ముందు ఆచితూచి ఆడినా సరే ఆ తర్వాత మాత్రం వెంటనే స్పీడ్ పెంచారు. కేవలం 5 ఓవర్లకే 54 పరుగులు సాధించారు ఇద్దరూ… ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అర్షదీప్ సింగ్ ఊరించే బంతితో విడగొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సామ్సన్ ను ఇషాన్ పోరెల్ తక్కువ స్కోర్ కే వెనక్కు పంపగా… క్రీజ్ లో పాతుకుపోయే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ జైస్వాల్, ప్రమాదకర ఆటగాడు లివింగ్ స్టోన్ తో కలిసి భారీ స్కోర్ చేసే ప్రయత్నం చేసాడు. అందుకు లివింగ్ స్టోన్ నుంచి కూడా సహకారం అందింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న స్టోన్ ను అర్శదీప్ చక్కటి బంతితో అవుట్ చేసాడు. ఆ బంతిని తక్కువ అంచనా వేసిన లివింగ్ స్టోన్ భారీ షాట్ కి ప్రయత్నం చేయగా అల్లెన్ కి క్యాచ్ ఇచ్చాడు.
ఆ వెంటనే జైస్వాల్ తో జత కలిసిన లామ్రార్ భారీ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసాడు. అప్పటి వరకు స్పీడ్ గా ఆడిన జైస్వాల్ చాలా స్లో గా ఆడాడు. అయితే ఇద్దరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారకముందే జైస్వాల్ ను హర్ప్రీత్ వెనక్కు పంపగా… ఆ తర్వాత వికెట్ లు పడుతున్నా సరే లివింగ్ స్టోన్ తర్వాత వచ్చిన లామ్రర్ చుక్కలు చూపించాడు. భారీ షాట్ లు ఆడుతూ పంజాబ్ బౌలర్లకు సవాల్ విసిరాడు. కేవలం 17 బంతుల్లోనే నాలుగు సిక్స్ లు రెండు ఫోర్లతో 43 పరుగులు చేసాడు. అయితే అతను ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో మరోసారి అర్శదీప్ కు కెప్టెన్ రాహుల్ బంతి ఇచ్చాడు.
కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా… చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేసిన యువ బౌలర్… మంచి బంతితో లామ్రార్ ను వెనక్కు పంపించాడు. ఇక రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్, మోరిస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీనితో రాజస్థాన్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. దూకుడుగా ఆడుతున్న ముగ్గురు టాప్ ఆర్డర్ ఆటగాళ్లను అర్శదీప్ అవుట్ చేసిన విధానం హైలెట్ గా నిలిచింది. ఊరించే బంతులు విసరడం తో భారీ షాట్ లు ఆడేందుకు బ్యాట్స్మెన్ ప్రయత్నం చేయడం ఫీల్డర్ చేతిలో చిక్కడం జరిగిపోయాయి.
అతని బౌలింగ్ యాక్షన్ కూడా చూడముచ్చటగా ఉంది. మంచి టెక్నిక్ తో బంతులు విసరడం, పరుగులు ధారాళంగా ఇవ్వకపోవడం అతనికి ప్లస్ అయ్యాయి. నాలుగు ఓవర్లలో 8 ఎకానమీ రేట్ తో 32 పరుగులు ఇచ్చి 5 వికెట్ లు తీసి కెరీర్ బెస్ట్ నమోదు చేసాడు. ఇదే నిలకడ కొనసాగిస్తే మాత్రం పంజాబ్ కు తిరుగు ఉండదు. అయితే చేజింగ్ లో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.