iDreamPost
android-app
ios-app

Army Helicopter, Kannur, Bipin Rawat – కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌

Army Helicopter, Kannur, Bipin Rawat – కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌

తమిళనాడులోని ఊటిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఇందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్, ఆయన సతీమణి, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. ఊటిలోని విల్లింగ్‌టన్‌ ఆర్మీ కాలేజీకి వెళ్లే  క్రమంలో కూనూరు సమీపంలో ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.

హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘనటనలో నలుగురు చనిపోయారు. మరికొంత మందిని సమీపంలోని కూనూరులోని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్‌ కూలిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. కూలిన తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. మంటలను అదుపులోకి తెచ్చింది.

బిపిన్‌ రావత్‌ గతంలో ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతి అనే పోస్టును కొత్తగా సృష్టించింది. దానికి అధిపతిగా బిపిన్‌ రావత్‌ను నియమించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను సమన్వయం చేసే బాధ్యతలను బిపిన్‌ రావత్‌ నిర్వర్తిస్తున్నారు.

ఈ విషయంపై ఇండియన్‌ ఆర్మీ స్పందించింది. ఆర్మీ హెలికాప్టర్‌ కానూరు సమీపంలో కూలిపోయిందని తెలిపింది. ఐఏఎఫ్‌ ఎంఐ – 17వీ5 మోడల్‌ హెలికాప్టర్‌ కూలిపోయిందని పేర్కొంది. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ ఉన్నట్లు ధృవీకరించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

ఈ పరిణామం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రస్తుతం కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రమాదంపై పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు. ఆ ప్రకటన తర్వాత ప్రమాదంలో ఎవరు చనిపోయారు..? బిపిన్‌ సురక్షితంగా బయట పడ్డారా..? లేదా..? అనేది తెలియనుంది.

Also Read : Farmers, Cyclones – రైతులను వణికిస్తున్న తుఫానులు