Idream media
Idream media
సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసుల విచారణలో వైఎస్ జగన్‌కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. గతంలోనూ సీబీఐ ప్రత్యేక కోర్టు, తమ వాదనలతో ఏకీభవించి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని తెలిపింది. ఇప్పుడు వైఎస్ జగన్ హోదా కూడా పెరిగిన కారణంగా.. సాక్ష్యులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. హాజరుకాకపోతే విచారణ ఆలస్యం అవుతుందని పేర్కొంది.
కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును జగన్ కోరగా సీబీఐ కోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ జగన్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ వాదనల్లో వాస్తవం లేదని, తన బదులు న్యాయవాది హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు హాజరవడం వల్ల పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. సీఎం హాదాలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఎక్కువ మంది వస్తారన్నారు. దీని వల్ల అందరికీ ఇబ్బందేనని వివరించారు. సీఎం కాక ముందు వైఎస్ జగన్ ప్రతి వారం విచారణకు హాజరయ్యారని, ప్రత్యేక సందర్భాలలో కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా విధులు నిర్వహించే వారు నిందితులుగా ఉన్నా.. వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీం కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సీబీఐ వాదనలు విడ్డూరం..
ఈ పిటిషన్‌లో సీబీఐ వాదనలు విడ్డూరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కాక ముందు వైఎస్ జగన్ ప్రతి వారం విచారణకు హాజరయ్యారు. సీఎం అయిన తర్వాత.. ఆ పదవిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన తరఫున న్యాయవాది హాజరవుతారని చెప్పారు. వాస్తవాస్తవాలను పట్టించుకోని సీబీఐ గుడ్డిగా.. ఎప్పటి మాదిరిగానే వాదించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారంలో ఒక రోజు (శుక్రవారం) జగన్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఆ రోజు హాజరవకపోతే.. సాాక్ష్యులను ప్రభావితం చేస్తారనే సీబీఐ వాదనల్లో ఏ మాత్రం పసలేదు. శుక్రవారం మినహాయిస్తే.. మిగిలిన ఆరు రోజులు వారంలో ఉంటాయి. ఆయా రోజుల్లో సాక్ష్యులను ప్రభావితం చేయలేరా..? అనే సందేహం సామాన్యులకైనా వస్తుంది. ఈ తర్కంతో సీబీఐ వాదనల్లో పసలేదని స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : Andhra Jyothi, Chandrababu – బాబు చేసిన నష్టానికి ఆంధ్రజ్యోతి ప్యాచ్‌వర్క్