iDreamPost
android-app
ios-app

2024 ఎన్నికల పొత్తు గురించి టీడీపీ సీనియర్లు ఏమనుకుంటున్నారు..?

2024 ఎన్నికల పొత్తు గురించి టీడీపీ సీనియర్లు ఏమనుకుంటున్నారు..?

2024 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఒంటరిగా బరిలోకి దిగాయి. బీజేపీ కూడా ఒంటరిగానే పోటీ చేసింది. జనసేన, కమ్యూనిస్టులు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాయి. ఆ తర్వాత జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కటీఫ్‌ చెప్పి కమలం పార్టీలతో జత కట్టింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి అభ్యర్థిని బరిలోకి దింపాయి. ఇంతకు మించి రాజకీయ ప్రాధాన్యం కలిగిన పరిణామాలు ఏమీ ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకూ పొత్తులపై కథనాలు వెలువడుతూనే ఉంటాయి. అందుకే 2024 ఏ పార్టీ ఏ పార్టీతో కలసి ఎన్నికలకు వెళుతుంది..? గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన పార్టీలు ఈ సారి కూడా అలానే వెళతాయా..? అనే అంశాలు అంచనా వేయడం కష్టమే.

అయితే 2024 ఎన్నికల్లో పొత్తుల గురించి తెలుగుదేశం పార్టీ సీనియర్లు మాత్రం తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తు గురించి ఇప్పుడు చెప్పలేమంటూనే.. భావ సారూప్యత, కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు టీడీపీ సీనియర్‌నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తు రాజకీయాలపై బుచ్చయ్య మాట్లాడడంతో.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య పోరు ఉంటుందనే చర్చకు తెరలేసింది. తెలుగుదేశం తప్పా మరో ప్రత్యామ్నాయం లేదన్న బుచ్చయ్య చౌదరి.. ఎన్నికల నాటికి టీడీపీతో కలిసే పార్టీలు పొత్తు పెట్టుకుంటాయన్నారు.

Also Read : టీడీపీ అనుకున్న‌దొక‌టి.. జరిగింది మరొకటి..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే పొత్తుల గురించి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మాట్లాడలేదు. కానీ ఆయన వ్యవహారశైలి, సందర్భానుసారంగా ప్రవర్తిస్తున్న తీరును చూస్తే.. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత తొలిసారి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అది మినహా.. మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్‌ మినహా ఏదో ఒక పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో కూడా టీడీపీ పొత్తుపెట్టుకుని తెలుగు రాష్ట్రాలలో వైసీపీ మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకున్న పార్టీగా నిలిచింది.

పొత్తు లేకుండా వెళ్లిన టీడీపీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో 2019లో చూశాం. ఒంటరి పోరుతో విజయతీరాలకు వెళ్లడం కష్టసాధ్యమని చంద్రబాబుకు తెలిసినా.. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా జనసేన పార్టీలతో పొత్తుపెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలకు ఏడాది ముందు జనసేన అధినేత టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించి.. చంద్రబాబుతో స్నేహాన్ని తెంచుకోగా.. నరేంద్రమోదీని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. బీజేపీతో టీడీపీ పొత్తు వదులుకుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంతో విభేదించి నష్టపోయామంటూ మాట్లాడిన చంద్రబాబు.. బీజేపీ పెద్దలకు తనపై ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

Also Read:ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర

2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులేకుంటే కష్టమని టీడీపీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారన్నది వాస్తవం. గత ఏడాది జరిగిన జూమ్‌ మహానాడులో.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని లైవ్‌లోనే చంద్రబాబుకు సూచించారు. లేకపోతే పార్టీని నడపడం కష్టమన్నారు. నేరుగా వెళ్లి నరేంద్రమోదీని కలిస్తే.. వారు క్షమించకుండా ఉండరని, పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఈ పని చేయకతప్పదని నెహ్రూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి మాటలు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తులతోనే ఎన్నికలకు వెళుతుందని చెప్పకనే చెప్పాయి. ప్రస్తుతం బీజేపీ–జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఈ పొత్తు ఇలాగే కొనసాగుతుందా..? ఈ ద్వయంతో టీడీపీ కలుస్తుందా..? లేదా టీడీపీతో ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ కలుస్తుందా..? వేచి చూడాలి.

చావో రేవో మాదిరిగా మారిన 2019 ఎన్నికల్లోనే తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము.. ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ సారి కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇక తేలాల్సింది మిగతా పార్టీల పయణమే.

Also Read : కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు వాస్తవమేనా?మమ్మల్ని కొన్నారంటున్న మాజీ మంత్రి