iDreamPost
android-app
ios-app

కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీజేపీ చూపు?

కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీజేపీ చూపు?

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజ‌కీయాల్లో వీరు తెలియ‌ని వారుండ‌రు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక కోట‌రీ క‌ట్టుకున్నారు. రాజ‌కీయ బ‌లంతో పాటు అంగ‌బ‌లం, అర్ధ‌బ‌లం ఉన్న వ్య‌క్తులు. ఆ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒక‌రు ఎంపీగా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ద‌శాబ్దాలుగా ఆ పార్టీకి వీర విధేయులుగా వారు కొంత కాలంగా పార్టీకి వ్య‌తిరేకంగా ప‌లు సంద‌ర్భాల్లో నిర‌స‌న స్వ‌రం వినిపించారు. పీసీసీ చీఫ్ నియామ‌కానికి సంబంధించి అయితే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అనంత‌రం మెత్త‌బ‌డినా పార్టీ చీఫ్‌ రేవంత్ తో అంటీముట్ట‌న‌ట్లు ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఇదే అద‌నుగా బీజేపీ వారి వ‌ల వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ‌లో పాగా వేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం. ప్ర‌తీ అడుగూ ఆ దిశ‌గా వేస్తోంది. దానిలో భాగంగానే రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ విడ‌త‌ల వారీగా ప్ర‌జా సంగ్రామ యాత్ర చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తొలి విడ‌త స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. దీంతో పాటు ఇత‌ర పార్టీలోని ప్ర‌ముఖుల‌పై కూడా పార్టీ ఫోక‌స్ పెడుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ను హుజూరాబాద్ నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో నిల‌ప‌డ‌మే కాదు.. కీల‌క ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టింది. అలాగే, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాలోని ప‌లువురి ప్ర‌ముఖుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాల‌పై అసంతృప్తిగా ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై బీజేపీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Also Read : గుత్తా కోరిక నెర‌వేరేదెన్న‌డో..?

బీజేపీలో చేర‌నున్న‌ట్లు కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చాలా రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. అయితే.. కొద్ది కాలంగా స్త‌బ్దుగా ఉన్నారు. కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. కానీ.. పార్టీకి విధేయులుగా ఉన్న వీళ్లు తమకు పార్టీలో అన్యాయం జ‌రుగుతుంద‌ని ఇటీవ‌ల పార్టీ పై అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యాడు. అన్న భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన ఆయన.. అధిష్ఠానం రేవంత్ రెడ్డికి దాన్ని కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ పై కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇలాంటి వ్యవహార శైలి నేప‌థ్యంలో పార్టీ న‌ష్టం జ‌రుగుతోంద‌ని రేవంత్ రెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఇక పార్టీలో పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. దీంతో అధిష్ఠానం కూడా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ను ఒక‌టిరెండు సార్లు మంద‌లించిన‌ట్లు తెలిసింది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తారా, చేయండి అంటూ వెంక‌ట్‌రెడ్డి కూడా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. ఈ ప‌రిస్థితులు అన్నింటినీ గ‌మ‌నిస్తున్న బీజేపీ అధిష్ఠానం వారిని త‌మ‌వైపు తిప్పుకునేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ విధేయులుగా పేరున్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read : ఆ ప్రచారం అంతా ఒట్టిదే.. వివేక్ వెంకటస్వామికి బీజేపీ అండ