iDreamPost
android-app
ios-app

AP Tourism-ఇదే టైం.. చ‌లో అర‌కు..

AP Tourism-ఇదే టైం.. చ‌లో అర‌కు..

ఆంధ్రా ఊటీగా పేరొందిన అర‌కు అందాల‌ను చూడాలంటే ఇదే స‌రైన స‌మ‌యం. శీతాకాలంలో మ‌రింత అద్భుతంగా అక్క‌డి వాతావ‌ర‌ణం ఉంటుంది. ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు అద్దం ప‌డుతుంది. గిరిజన ప్రాంతమైన అరకు విశాఖ ప్రాంతంలో అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పాలి. పచ్చని కొండల మధ్యలో ఉండే చల్లని లోయ ఇది. ఇక్కడ పద్మావతీ గార్డెన్స్, దగ్గరలోని చాపరాయి, బొర్రా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలతో పాటు గిరిజన మ్యూజియం సందర్శకులను మైమరిచిపోయేలా చేస్తాయి. తేయాకు తోట‌లు ఆహ్లాద‌ప‌రుస్తాయి. మ‌న‌సుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అంద‌జేస్తాయి. అంతేకాదు.. విశాఖ స‌ముద్ర తీరం, స‌మీపంలోని లంబ‌సింగి, ఆధ్మాత్మిక కేంద్రాలు ఇలా ప్ర‌తీ ఒక‌టి దేనిక‌వే ప్ర‌త్యేకం.

ఆంధ్రా కాశ్మీర్

లంబసింగి విశాఖ మన్యంలో మరో అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందుకే దీనిని ఆంధ్రా కాశ్మీర్ అని కూడా అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ కొండపై నుంచి చలికాలంలో సూర్యోదయాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది.

ఆధ్యాత్మిక పరవశం..సింహాచలం:

విశాఖకు దగ్గరలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం దర్శనానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు వస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిది  ఉగ్ర రూపం. చందనంతో కప్పబడి నిత్యం దర్శనం ఇస్తారు. సంవత్సరంలో ఒక్కసారి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.

Also Read : Assembly Resolution – BC Census : బీసీ జ‌న‌గ‌ణ‌న‌పై జగన్ సర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

భీమిలి ఎర్రమట్టి దిబ్బలు:

ఎర్ర మట్టి దిబ్బలు విశాఖపట్నం శివార్లలోని భీమిలిలో ఉన్నాయి. ఈ భౌగోళిక వారసత్వ ప్రదేశం 12,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటిది. విశాఖపట్నం మరియు బీమునిపట్నం తీరాల మధ్య విస్తరించి ఉన్న ఈ 10 కి.మీ ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. దశాబ్దాల క్రితమే ఎర్ర మట్టి దిబ్బలు విశిష్టతను విలియం కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త వీటిని కనుగొన్నారు. వైజాగ్‌కు సమీపంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.

సబ్‌మెరైన్ మ్యూజియం:

మీరు ఆ మధ్య వచ్చిన ఘాజీ సినిమా చూశారా? ఆ సినిమాలో చెప్పిన కథ ఈ కురుసురా కథే! క్లిష్టమైన పరిస్థితుల్లో పాక్ జలాంతర్గామిని ముంచేసి భారత్ కు రాబోతున్న ముప్పు తప్పించిన సబ్ మెరైన్ కురుసురు. కురుసుర కు రిటైర్మెంట్ ఇచ్చేశాకా.. దానిని విశాఖ బీచ్ వద్ద నిలిపారు. దీనిని ఇప్పుడు సబ్ మెరైన్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ జలాంతర్గాముల గురించిన అన్ని విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు. విశాఖ వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా చూసి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి.

డాల్ఫిన్ నోస్ కొండ :

విశాఖపట్నం సహజ రేవు పట్టణంగా ఉండటానికి కారణం ఈ డాల్ఫిన్ నోస్ కొండ. ఈ కొండ అచ్చు డాల్ఫిన్ ముక్కులా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. డాల్ఫిన్ నోస్ కొండ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

రిషికొండ బీచ్:

సహజంగా వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చే బీచ్ ఆర్కే బీచ్. అయితే, అంతకంటే అందమైన బీచ్ మరోటి ఉంది. అదే రిషికొండ బీచ్. ఒక పక్క కొండ. కొండ అంచునే ఉండే సముద్రం. వంపు తిరిగిన బీచ్. చూడగానే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ బీచ్ లో ఎంతసేపు ఉన్నా సమయం తెలీదు అంటే అతిశయోక్తి కాదు… ఇలా ఎన్నో అనుభూతుల‌ను పొందాలంటే ఏపీలోని విశాఖ ప‌రిస‌ర ప్రాంతాల్లో చ‌క్క‌ర్లు కొట్టాల్సిందే. ఇంకెందుకు ఆల‌స్యం.. చ‌లో. చ‌లో..!

Also Read : AP Cabinet Decisions – సామాజిక సంక్షేమం వైపు అడుగులు.. ఏపీ కేబినెట్‌ కీలక తీర్మానాలు