Idream media
Idream media
వచ్చే ఎన్నికల్లో పంజాబ్ పీఠం కైవసమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నీ కలిసి వస్తున్నాయి. ఒకవైపు సర్వేలన్నీ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలోనూ మెరుగైన స్థానాలు వస్తున్నాయి. తాజాగా.. పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసి ముందు వరుసలో నిలిచింది. బీజేపీ, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాలకు పరిమితం అయ్యాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మొత్తం 35 స్థానాలకు గాను.. ఆప్ పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 12 స్థానాలను, కాంగ్రెస్ 8, అకాలీదళ్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బతగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు మేయర్ రవికాంత్ శర్మ, మాజీ మేయర్ దవేష్ మౌద్గిల్ ఇద్దరూ ఓడిపోయారు. చండీగఢ్ ఫలితాలు పంజాబ్‌లో తక్షణ మార్పును సూచిస్తున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవినీతి రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. పంజాబ్ మార్పుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
ఆ రెండింటితో కలిసి బీజేపీ నెట్టుకొస్తుందా?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు ఆప్ లో ఉత్సాహాన్ని నింపితే, బీజేపీకి భారీ షాక్ ను ఇచ్చాయి. రైతుల ఉద్యమం ఎఫెక్టో, ప్రభుత్వ వ్యతిరేకతో కానీ.. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ శాసనసభ ఎన్నికల్లోగా బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్‌సీ), సుఖదేవ్‌సింగ్ ధిండ్సా పార్టీ శిరోమణి అకాలీదళ్(సంయుక్త)లతో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తాజాగా ప్రకటించారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల వ్యూహం రూపొందించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా నివాసంలో షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఆ పార్టీ అగ్రనాయకులు, అమరేంద్రసింగ్, ధిండ్సా సమావేశమయ్యారు. మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం బీజేపీ పంజాబ్ ఎన్నికల ఇన్‌చార్జి అయిన షెకావత్ చెప్పారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లతో పాటు వివిధ రైతు సంఘాలు కూడా పోటీచేసే అవకాశం ఉన్నందున పంజాబ్‌లో పంచముఖ పోటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ తో చేతులు కలిపాయి. మరి బీజేపీ పొత్తులు ఎంత వరకు లాభిస్తాయో వేచి చూడాలి.
Also Read : బీజేపీ ఎంపీ చురకలు : పగలు బహిరంగ సభలు.. రాత్రుళ్లు కర్ఫ్యూలా..?