iDreamPost
iDreamPost
ఢిల్లీ తర్వాత తాము అధికారంలోకి వచ్చే రెండో రాష్ట్రం పంజాబ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్వేలు కొంత సానుకూలంగా ఉండడంతో ఆశావాహకంగా అడుగులు వేస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముందని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. దాంతో తమకు ఛాన్స్ ఖాయమని ఆప్ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా తాజాగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత ఎన్నికలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పట్లో ఎన్నికల ఫలితాల తర్వాతే సీఎం ఎవరన్నది నిర్ణయించాలని ఆప్ భావించింది. ఈసారి ముందుగానే సీఎం అభ్యర్థిని ఖాయం చేసి ప్రకటించింది. హస్యనటుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి రెండు మార్లు ఎంపీగా ఎన్నికయిన భగవంత్ మాన్ ని ఆప్ సీఎంగా తేల్చిచెప్పింది.
హాస్యనటుడిగా భగవంత్ మాన్ కి మంచి పేరుంది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఆప్ తరుపున వరుసగా 2014,19 ఎన్నికల్లోనూ గెలిచారు. సంగ్రూర్ పార్లమెంట్ స్థానం ఉంచి ఆయన లోక్ సభకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాట్ సిక్కు కులానికి చెందిన వాడు. పంజాబ్ లో ఈ కులస్తులు దాదాపు 20 శాతం ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాట్ సిక్కులలో ఆదరణ ఉండేది. ప్రస్తుతం ఆప్ వారి మీద గురిపెట్టింది. దానికి తగ్గట్టుగానే సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది.
భగవంత్ మాన్ ని ప్రత్యర్థులు పెగ్ పంత్ మాన్ అని ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన మద్యం సేవించి పార్లమెంట్ తో పాటుగా రోజువారీ వ్యవహారాలకు హాజరుకావడం వివాదాస్పదమయ్యింది. చివరికి ఆప్ కే చెందిన సహచర ఎంపీ ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. తన సీటు మార్చాలని లోక్ సభ స్పీకర్ ని అభ్యర్థించడం ఆశ్చర్యకరంగా మారింది. నిత్యం మద్యం మత్తులో ఉండే భగవంత్ మాన్ వల్ల తనకు సమస్యగా ఉందంటూ సహచర ఎంపీ చేసిన ఫిర్యాదు చర్చనీయాంశమయ్యింది. అయితే తాను మద్యానికి బానిసను కాదని భగవంత్ సరిపెట్టుకున్నారు. తనకు మద్యం అలవాటు ఉందని మాత్రం అంగీకరించారు .
పంజాబ్ లోని మజ్హా, దౌబా ప్రాంతాల్లో భగవంత్ మాన్ కి గట్టి పట్టుంది. దాంతో ఆయన రాజకీయ చాణిక్యం కలిసి వస్తుందని ఆప్ భావిస్తోంది. ఈసారి పంజాబ్ మీద ఆప్ లో గట్టి ఆశలే ఉన్నాయి. ఢిల్లీ ఆవల విజయం సాధించడం ద్వారా భవిష్యత్తులో దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశిస్తోంది. ఇప్పటికే గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల మీద కూడా కన్నేసింది. అయితే పంజాబ్ ఫలితాల ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లో ఆప్ కి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తోంది. దాంతో భగవంత్ మాన్ ఎంపిక ఏమేరకు ఆపార్టీకి ఉపయోగపడుతుందో చూడాలి.