iDreamPost
android-app
ios-app

విధేయతకు పట్టం- ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజా నాథ్ నియామకం

విధేయతకు పట్టం- ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజా నాథ్ నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గడచిన శాసనసభలో కానీ, బహిరంగ సభలలో కానీ తన వాగ్ధాటితో ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయగల,సుతిమెత్తని వ్యంగపు చతురోక్తులతో విపక్షాలను ఇరుకున పెట్టగల దళిత నేత ప్రత్యేకించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సాకే శైలజానాథ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఏపీసీసీ అధ్యక్షునిగా నియమించినది. ఈ నియామకం విధేయతకు,నమ్మకానికి పట్టం కట్టినట్లైంది.

సీనియర్ నేత,కేంద్ర మాజీ MP మల్లు అనంతరాములు (1990లో) PCC అధ్యక్షుడిగా చేసిన ముప్పై సంవత్సరాలకు శైలజానాథ్ రూపంలో దళిత నేతకు పీసీసీ అధ్యక్ష పదవి లభించింది.
 
శైలజానాథ్ తండ్రి ధర్మవరం రామకృష్ణ ప్రముఖ కవి. చాటువులు వంటివి రచించి సాహిత్యరంగంలో లబ్ధప్రతిష్టులుగా పేరొందిన వారితో సమాన ఆదరాభిమానాలు చూరగొన్నవాడు. శైలజానాథ్ తన ప్రాథమిక విద్య,ఇంటర్ మీడియట్ విద్య నంతటినీ ధర్మవరంలోనే పూర్తి చేసుకున్నాడు.బీఎస్సీ డిగ్రీ కోసం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చేరినప్పటికీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ కర్నూలులో సీటు రావడంతో కర్నూలులో చేరాడు. అక్కడ ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. కర్నూలులో ఎంబీబీఎస్ తో పాటుగా ఎండీ కూడా పూర్తి చేశాడు.

అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ గా కొద్ది రోజులు,ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాలలో వైద్యునిగానూ పలు ప్రాంతాలలో పని చేశాడు. విద్యార్థి నాయకుడిగా పనిచేసినపుడే ప్రజల సమస్యల కోసం ఎందాకైనా తెగించి పోరాడే లక్షణాన్ని అలవరచుకున్నాడు.

1999 లోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన శైలజానాథ్ అప్పటి స్థానిక నాయకత్వం మద్దతు కొరవడడంతో టికెట్ పొందలేకపోయాడు. 2004 నాటికి తోపుదుర్తి భాస్కర్ రెడ్డి,అనంత వెంకటరామి రెడ్డిల‌ మద్దతుతో టికెట్ పొందిన శైలజానాథ్ శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలుపొందాడు. అనతికాలంలోనే వైఎస్ మన్ననలు పొందాడు.

2009 ఎన్నికల్లో రెండవసారి కూడా శింగనమలలో గెలిచి విప్ గా నియమింపబడ్డాడు. ఈ సమయంలోనే తన సామర్థాన్ని, ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు.శాసనసభలో విషయపరిజ్ఞానంతో బాగా మాట్లాడగలిగే నేర్పు భవిష్యత్ లో అతనికి కలిసివచ్చింది.

వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా స్థానం దక్కటంతో శైలజానాథ్ వెనుదిరిగి చూడలేదు. తన నియోజకవర్గంలోని నీటి తీరువాల విషయంలో జేసీ మాటలను,బెదిరింపులను లెక్క చేయకుండా ఆయకట్టుకు నీరు వదిలేలా చేయడంలో కృతకృత్యుడయ్యాడు.

ప్రాథమిక విద్యా శాఖా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ తనదైన శైలిలో ఆ శాఖను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు సోదాహరణంగా వివరించే ప్రయత్నంలో కీలక నాయకుడిగా ఎదిగాడు. ఈ తరుణంలో జాతీయ నాయకత్వ దృష్టిని ఆకర్షించాడు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోయిన పరిస్థితులలో 2014,19లలో పోటీ చేసి ఓడినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని శైలజానాథ్ ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. శైలజానాథ్ కు భార్య మోక్ష ప్రసూన (సీనియర్ సర్జన్), కుమారుడు సాకే రుత్విక్ హృదయ్ (వైద్యుడు) ఉన్నారు.