Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో రెండు కీలక ప్రకటనలు చేయబోతున్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయడమే మిగిలింది. అయితే మూడు రాజధానుల బిల్లు స్థానంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం.
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ప్రకటనతోపాటు.. మరో కీలక అంశంపై కూడా సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు బిల్లును కూడా జగన్ సర్కార్ ఉపసంహరించుకోనున్నట్లు తెలిసింది. గత ఏడాది జనవరి 27వ తేదీన శాసన మండలిని రద్దు చేయాలంటూ శాసన సభలో తీర్మానం చేసిన ఏపీ ప్రభుత్వం.. దాన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఆ అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును వరుసగా రెండుసార్లు పంపినా మండలిలో ఆమోదించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు నాటి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. మండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండడం, చైర్మన్ కూడా టీడీపీకి చెందిన వ్యక్తే కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా మూడు రాజధానుల బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. జనవరి 25వ తేదీన జరిగిన సమావేశంలో.. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌కు దిశానిర్ధేశం చేశారు. నిబంధనలకు విరుద్ధమైనా తాను ఈ పని చేస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ కూడా అన్నారు.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఎం జగన్.. మండలి నిబంధనల ప్రకారం సాగడంలేదని, దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. సీఎం సూచన మేరకు జనవరి 27వ తేదీన అసెంబ్లీలో మండలి వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగింది. ఆపై మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఉపసంహరించుకుంటే.. మండలి యథావిధిగా కొనసాగనుంది. వచ్చే నెల 14వ తేదీన వెల్లడయ్యే స్థానిక సంస్థల కోటా 11 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మండలిలో వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కనుంది.
Also Read : Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం