iDreamPost
android-app
ios-app

ఏపీ : కరోనాపై యుద్ధం.. వ్యాక్సిన్‌ సిద్ధం

ఏపీ : కరోనాపై యుద్ధం.. వ్యాక్సిన్‌ సిద్ధం

కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఏపీ భావిస్తోంది. దీనిలో భాగంగానే అందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగానే వేస్తామని ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే ప్రకటించిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి సారించారు. కట్టడి చర్యల్లో భాగంగా నైట్‌ కర్ఫ్యూ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు వంటి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియను వేగవంతం చేసింది. వ్యాక్సిన్‌ అందించే ఆయా సంస్థలతో స్వయంగా మాట్లాడిన సీఎం జగన్‌ ఒకరోజు వ్యవధిలోనే మరోసారి లేఖ రాశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచింది. ఫలితంగా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,972 శాంపిల్స్‌ను పరీక్షించగా 11,698 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. పరీక్షలు, కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి మరో లక్ష కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. పుణె నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌ పోర్టుకు వచ్చిన వ్యాక్సిన్‌ను అధికారులు స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి వాటిని కొరతగా ఉన్న జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు వారు తెలిపారు.

ఇదిలా ఉండగా, మరిన్ని డోస్‌ల కోసం ఏపీ విస్తృత ప్రయత్రాలు చేస్తోంది. ‘‘రాష్ట్రంలో 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్‌ ఇవ్వాలి. అందుకు 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరం. ఆమేరకు వ్యాక్సిన్లను ఆంధ్రప్రదేశ్‌కి అమ్మడానికి ముందుకు రండి’’ అని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలకు లేఖ రాసింది. ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా శుక్రవారం ఈ సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో శనివారం ఆరోగ్య శాఖ ఆ సంస్థలకు వ్యాక్సిన్‌ పంపాలని కోరుతూ లేఖ రాసింది. కేంద్రం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్ల బిల్లులను త్వరగా చెల్లిస్తామని సంస్థలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Also Read : ఇటు కరోనా కట్టడి.. అటు వ్యాక్సినేషన్‌.. ఒకే రోజు ఏపీ సర్కార్‌ రెండు నిర్ణయాలు