iDreamPost
android-app
ios-app

ఉద్యోగాంధ్ర‌ప్ర‌దేశ్ : ఏపీ వినూత్న నిర్ణ‌యాలు

ఉద్యోగాంధ్ర‌ప్ర‌దేశ్ : ఏపీ వినూత్న నిర్ణ‌యాలు

ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం.. అనేది నానుడి. మారిన కాలంలో పురుషుడే కాదు.. మ‌హిళ‌లు ఉద్యోగాల కోసం పోటీ ప‌డుతున్నారు. ల‌క్ష‌లాది మంది ఉద్యోగాల కోసం ప్ర‌భుత్వం వైపు ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి ఆశ‌ల‌ను నెర‌వేరుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వ‌మూ ఆలోచించ‌ని విధంగా యువ‌త కు ఉద్యోగ క‌ల్ప‌న కోసం అడుగులు వేస్తోంది. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన జాబ్ కేలాండ‌ర్ ఇప్ప‌టికే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌క్క రాష్ట్రం తెలంగాణ జాబ్ కేలండ‌ర్ తెర‌పైకి తెచ్చింది. మ‌రిన్ని రాష్ట్రాలు కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని అనుస‌రించ‌నున్నాయి. ఇప్పుడు ఏపీ మ‌రిన్ని కొత్త త‌ర‌హా సంస్క‌ర‌ణ‌ల వైపు అడుగులు వేస్తోంది. యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌కే యువ‌త‌కు సుమారు నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించింది. సచివాలయాల ఉద్యోగాలు, వ‌లంటీర్లు, ఎండీయూ ఆపరేటర్ల పేరుతో రేషన్ సరకుల పంపిణీ పోస్ట్ లు.. ఇలా లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల కల నెరవేర్చారు జగన్. ఇటీవ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్ మ‌రిన్ని ఉద్యోగాల క‌ల్ప‌న మార్గాల‌పై చ‌ర్చించారు. ఎక్క‌డ ఎన్ని ఖాళీలున్నాయే ప‌రిశీలించి, వాటి భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. నెల నెలా జాబ్ కేలండ‌ర్ లో వాటిని ప్ర‌క‌టించాల‌ని సూచించారు. అంతేకాకుండా, ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ఇత‌ర మార్గాల‌ను కూడా అన్వేషించాల‌ని సూచించారు. దాని ఫ‌లిత‌మే డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్ పేరుతో కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చించింది ఏపీ ప్ర‌భుత్వం.

రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలు భాగంగా ఆగస్టు 15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్రారంభించనుంది. ఈ ఎక్సేంజ్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇక‌పై నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించ‌నున్నారు. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక‌మైన నెట్ వ‌ర్క్ ను ప్ర‌భుత్వం రూపొందిస్తోంది. ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించ‌నుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్‌ని అనుసంధానం చేయ‌డం ద్వారా త్వ‌ర‌తిగ‌తిన ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు చర్యలు చేప‌డుతోంది.

ఉద్యోగ క‌ల్ప‌న కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు నిధుల ఇబ్బంది లేకుండా బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలను అన్వేషించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు అందాయి. అలాగే, మ‌రిన్ని స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ క‌ళాశాల‌లు ఏపీలో రానున్నాయి. అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతుందని ప్ర‌భుత్వ అభిప్రాయం. ఆ మేర‌కు త‌న కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ఇక‌పై ఏపీ యువ‌త‌కు జాబ్ కేలండ‌ర్ ద్వారానే కాకుండా, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్ ద్వారా కూడా ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.