iDreamPost
android-app
ios-app

తుందుర్రు లాంటి ఆక్వా పరిశ్రమల కాలుష్యానికి ప్రభుత్వ శాశ్వత పరిష్కారం

తుందుర్రు లాంటి ఆక్వా పరిశ్రమల కాలుష్యానికి ప్రభుత్వ శాశ్వత పరిష్కారం

తుందుర్రు.. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సమీపంలోని తుందుర్రు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక్కడి సహజవనరులైన గాలి, నీరు, సారవంతమైన భూమి తీవ్రంగా కాలుష్యమవుతుందని తద్వారా తమ ఆరోగ్యానికే ఇబ్బంది అని అనేకమార్లు తుందుర్రు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టగా ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం.. అక్కడ ఉద్యమం చేసిన వైసీపీ, వామపక్ష నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతల్ని పోలీసులు అరెస్టులు చేయడం జరిగింది. ఈ ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, బేతపూడి, గొల్లవానితిప్పతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలకు దిగారు. చాలా రోజులపాటు పోలీసులు తుందుర్రును తమ అదీనంలోకి తీసుకున్నారు. ఆక్వాపార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారిపై లాఠీ చార్జీలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

ప్రతిపక్షనేతగా ఉన్నపుడు ప్రజాసంకల్ప యాత్రలో జగన్ ఆక్వాపార్కును వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులకు మద్దతిచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆక్వాపార్కును మూయించివేస్తానని హామీ ఇచ్చారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చినమాటను నిలబెట్టుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆక్వా వ్యాపారం మూత పడకుండానే దీనికి పరిష్కారం కనుగొన్నారు. తాను అధికారంలోకి వస్తే జనావాసాలకు దూరంగా ఇటువంటి ఫ్యాక్టరీలను తీసుకెళ్తానని హామీ ఇచ్చిన విధంగానే ఇంటిగ్రేటెడ్‌ మెరైన్‌ ఔట్‌ ఫ్లో పార్క్‌ ద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు కాలుష్యం నుండి విముక్తి కలిగించనున్నారు. ఇలాంటి మెరైన్‌ పార్క్‌ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిది కానుంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో చిన్న,మధ్య తరహా ప్రోసెసింగ్‌ యూనిట్లు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీటినుండి ప్రతీరోజూ భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఈ యూనిట్లనుండి శుద్ధి అనంతరం మిగిలే నీటిని భూగర్భంలోకి లేదా సమీప నీటి వనరుల్లోకి కలిపేస్తుండడంతో భూమి, నీరుతో పాటు గాలి కూడా విపరీతంగా కలుషితమౌతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల సముద్రతీరం వెంబడి ఉన్న వందల గ్రామాల్లో ఇలాంటి ప్రోసెసింగ్‌ యూనిట్ల వల్ల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. సమీపంలోని పొలాలు కూడా బీడువారిపోయాయి.

ఇలాంటి మానవ మనుగడను ప్రశ్నార్ధకం చేసే విపత్కర పరిణామాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం Integrated Marine Outflow Park ఏర్పాటుకు ప్రతిపాదనలు తెలపగా నిర్మాణానికి GMR ముందుకు వచ్చింది. దీంతో పార్క్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దేశంలో నీలి విప్లవ ప్రభావం గోదావరి జిల్లాలపై తీవ్రంగా పడుతోంది. కోస్తా జిల్లాల్లో చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండడంతో ఈ విప్లవం గోదావరి జిల్లాల రూపురేఖల్ని మార్చింది. రెండు జిల్లాల్లో సుమారు 2లక్షల ఎకరాల పొలాలను చేపల చెరువులుగా మార్చేసారు. ప్రతీయేటా వందల ఎకరాల భూముల్ని తవ్వేస్తున్నారు. చెరువులు వేసి రొయ్యలు, చేపలు పెంచుతున్నారు. ఈ ప్రాంతం నుండే ప్రతీ సంవత్సరం 5,700 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుండగా లక్షలమందికి ఇక్కడ ఉపాధి దొరుకుతోంది. చెరువుల్లోని రొయ్యలు, చేపలను శుద్దిచేసి ఎగుమతిచేసే యూనిట్లు గతంలో చెన్నై, కలకత్తా వంటి ప్రాంతాల్లోనే ఉండేవి. కానీ గత కొన్నేళ్లక్రితం ఆ యూనిట్లు నేరుగా గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసారు. దాంతో ఇక్కడ విపరీతమైన కాలుష్యం పెరిగింది. భూమి, నీరు, గాలి కాలుష్యం బారినపడ్డాయి. మూడేళ్ళక్రితం తుందుర్రులో ఏర్పాటైన గోదావరి ఆక్వా ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ కూడా ఈకోవకు చెందినదే.

ఈ పరిశ్రమ తమకొద్దంటూ ఉద్యమం చేసిన ప్రజలపై అప్పటి సీఎం చంద్రబాబు విరుచుకు పడ్డారు. పరిశ్రమల్ని అడ్డుకోవడం తప్పంటూ ఆందోళనకారులపై లాఠీలు విరిచి జైళ్లలోకి తోసారు. సదరు పార్కుకు అనుమతులిచ్చేసారు. ఇప్పుడు ఈ యూనిట్ ప్రోసెసింగ్‌ మొదలైపోయింది. ప్రోసెసింగ్ అనంతరం విడుదలయ్యే కాలుష్య కారక విషజలాలను పంట కాలువల్లోకి వదలకుండా సముద్రగర్భం పైప్‌లేసి మళ్ళిస్తామని హామీఇచ్చినా ఆహామీ అమలుకాలేదు. ఆక్వాపార్కునుండి విడుదలౌతున్న వ్యర్ధజలాలు పంటపొలాల్లోకి, నీటికాలువల్లోకి చేరుతూ వందలమంది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది.

అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఊరటనిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతీ రెండు జిల్లాలను కలిపి ఓ ప్రాంగణంగా నిర్దేశించారు. ఆ రెండు జిల్లాల పరిధిలో లభించే సహజ వనరులతోపాటు ఇతర అవకాశాల్ని బేరీజు వేసి వాటికి అనుగుణమైన రీతిలో అక్కడ అభివృద్ది చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగానే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు రెండింటినీ కలిపి ఒక ప్రాంగణంగా సెలక్ట్ చేసారు. ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమల ద్వారా మరింత వృద్ది సాధించవచ్చని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ దీనికి అనువైన పరిశ్రమలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలో దాదాపుగా పన్నెండేళ్లగేళ్లక్రితం కాకినాడ సెజ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన “ఇంటిగ్రేటెడ్‌ మెరైన్‌ ఔట్‌ ఫ్లో పార్క్‌” ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే గోదావరి జిల్లాల్లో కాలుష్యం భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ కేంద్రంగా ఇంటిగ్రేటెడ్‌ మెరైన్‌ ఔట్‌ ఫ్లో పార్క్‌ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సుమారు 14సంత్సరాల క్రితం కాకినాడ సమీపంలో నెలకొల్పిన కాకినాడ సెజ్‌ పరిధిలోని గల వంద ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించనుంది. దీంతో ఇప్పటినుంచి గోదావరి జిల్లాల్లో ఎక్కడా రొయ్యలు, చేపల శుద్ది కర్మాగారాల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. సెజ్‌ నిర్వాహకులైన జీఎమ్‌ఆర్‌ సంస్థే ఈ మెరైన్‌ ఔట్‌ ఫ్లోను కూడా నెలకొల్పుతోంది. ఈ పార్క్ లో జల సంపద శుద్ది కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తారు. దీనికోసం విడివిడిగా స్థలాలు కేటాయిస్తారు. అలాగే వీటి నిర్వహణకు అవసరమైన వసతులను కూడా సెజ్‌ నిర్వాహకులే ఏర్పాటుచేస్తారు.

ప్రాసెస్సింగ్ లో కీలకమైన నీటిని సముద్రం నుంచి సేకరించి శుద్దిచేసి ఈ కర్మాగారానికి అందిస్తారు. చేపలు, రొయ్యలను శుద్ది చేసిన తర్వాత మిగిలే వ్యర్ధాలను, వృధా నీటిని నేరుగా భూగర్భం లోకి లేదా సముద్రంలోకి వెళ్ళేందుకు అనుమతించరు. వాటిని కూడా తిరిగి ఈ ఇంటిగ్రేటెడ్‌ మెరైన్‌ ఔట్‌ ఫ్లో పార్క్‌ నిర్వాహకులే మరోసారి ప్రోసెసింగ్‌ ద్వారా శుద్ది పరుస్తారు. అనంతరం సముద్రంలో దాదాపుగా 5 కిలోమీటర్ల లోపలకు పైప్‌లైన్ల ద్వారా పంపి అక్కడ సముద్రంలో కలిపేస్తారు.

ఈ పార్క్ పూర్తిగా ఎగుమతుల ఆధారిత కేంద్రంగా ఏర్పాటుకానుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించిన రొయ్యలు, చేపల రవాణా మొత్తం విశాఖ పోర్టు జరుగుతోంది. అయితే కాకినాడ సెజ్‌లోనే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేయడం ద్వారా స్థానికంగా ఈ రెండు జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాల పారిశ్రామికవేత్తలకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. ఈ సెజ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కొంతకాలం వరకూ కరెంట్ చార్జీలపై కొన్ని రాయితీలు ఇస్తారు. అలాగే పన్నులు, సబ్సిడీలు ఇస్తారు. ముఖ్యంగా 20 ఏళ్లవరకూ ఇన్ కం ట్యాక్స్ వర్తించదు. అలాగే ఈ మెరైన్‌ ఔట్‌ ఫ్లో పార్క్‌ దగ్గర్లోని ఇదే సెజ్‌లో మరో పోర్టు కూడా త్వరలోనే నిర్మాణంకానుంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు నుంచే ఎగుమతులు నిర్వహించుకునే అవకాశముంది. దీంతో ఇక్కడి పారిశ్రామికవేత్తలకు విశాఖకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే తుందుర్రు ఆక్వాపార్కు వంటి వందల పార్కులు మూతపడడం వల్ల కొన్ని వేల గ్రామాల ప్రజలు ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందుకే అంటారు మనసుంటే మార్గం ఉంటుంది అని.