iDreamPost
iDreamPost
యుద్దం చేయాలంటే ఆయుధాలు కావాలి. వైద్యం చేయాలంటే దానికి సంబంధించిన సామాగ్రి కావాలి. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో ప్రపంచమంతా తగిన వైద్య సదుపాయాలు లేక సతమతం అవుతున్నారు. చివరకు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలే విలవిల్లాడిపోతున్నాయి. ఇక మనలాంటి వ్యవస్థలో సమస్యలు చెప్పనవసరం లేదు. అనూహ్యంగా విరుచుకుపడిన మహమ్మారిని ఎదుర్కోవడంలో టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత రక్షణా సామాగ్రి, మాస్కులు, వెంటిలేటర్ల కోసం వివిధ దేశాల పై ఆధారపడక తప్పలేదు. ఇప్పటికైనా చైనా నుంచి మన దేశానికి 1.70లక్షల పీపీఈలు దిగుమతి చేసుకున్నారు. మనదేశం నుంచి కూడా అమెరికా సహా అనేక దేశాలకు మందులు, కిట్లు పంపిణీ చేయక తప్పడం లేదు.
ఇలాంటి విశ్వ వ్యాప్త పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసింది. క్లిష్ట సమయంలో కీలక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలకు దారిచూపుతున్నాయి. తీవ్ర సమస్యగా ఉన్న కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈల కొరత తీర్చే దిశలో ఏపీ సాగుతోంది. మేడిన్ ఆంధ్రా అంటూ ఇప్పటికే టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసింది. విశాఖలోని మెడ్ టెక్ జోన్లో తయారయిన కిట్లు సీఎం పరిశీలించారు. నాణ్యత కు సంబంధించి నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో కేవలం 55 నిమిషాల్లో రిపోర్టు వెల్లడించే కిట్లు వెలువడడంతో ఏపీలో వైద్య రంగం ఊపిరిపీల్చుకునే అవకాశం వస్తోంది. ర్యాండమ్ పరీక్షలు వేగవంతం చేయడం ద్వారా కరోనా కట్టడికి కీలక అవకాశం చేజిక్కినట్టవుతుంది.
అదే సమయంలో పీపీఈలు లేక చాలామంది వైద్యులు సతమతం అవుతున్నారు. అనంతపూర్ లో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ కష్టాలను ఎదుర్కొంటూ అనేకమంది ముందడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ తగిన రక్షణా సామాగ్రిని తూర్పు గోదావరి కాకినాడ సెజ్ లో సిద్ధం చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న బాధితులకు చికిత్స అందించాలంటే కనీసంగా రోజుకి 1500 పీపీఈలు అవసరం. ఇప్పుడు కాకినాడ సెజ్ లో ని చైనా బొమ్మల కంపెనీలు ఈ పీపీఈలకు ప్రభుత్వం చొరవ చూపడంతో రోజుకి 2వేలు రెడీ అవుతున్నాయి. రాబోయే వారంలో అది 5వేలకు చేరుతుందని చెబుతున్నారు. అదే జరిగితే కేవలం ఏపీకి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. వైద్యులకు భరోసా దక్కుతుంది.
ఇక వెంటిలేటర్లు కూడా తయారీకి రంగం సిద్ధం అయ్యింది. వచ్చే వారంలోగా ఏపీలో వెంటిలేటర్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం మే మొదటి వారం నాటికి అవి బయటకు వస్తే ఇక సమస్య ఎంత తీవ్రం అయినప్పటికీ చేదాటిపోకుండా చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మాస్కూల కొరత నివారించేందుకు ఇప్పటికే కేంద్రం నుంచి వస్తున్న కోటాతో పాటుగా స్థానికంగా నాణ్యతతో కూడా ఎన్ 95 మాస్కుల తయారీ మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ముడిసరుకు అందగానే వాటిని కూడా సిద్ధం చేసే అవకాశం ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.
చేతలకే ప్రాధాన్యతనిస్తున్న జగన్
ఇలాంటి ఓ పెద్ద ముందడుగు వేసిన నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. దేశంలో తొలిసారిగా టెస్టింగ్ కిట్లు సిద్ధం అయ్యాయి. అందరికన్న అత్యధికంగా పీపీఈలు తయారవుతున్నాయి. వెంటిలేటర్ల ఉత్పత్తికి రంగం సిద్ధం అయ్యింది. ఇలాంటి అనేక అశావాహ పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా ఉండడం విశేషం. అయినప్పటికీ మాటలకు కాకుండా చేతలకే ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న తీరు విశేషంగా చెప్పవచ్చు. స్వయంగా సీఎం నిత్యం సమీక్షలు జరుపుతూ అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారు. పరిశ్రమల, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వాటి ఉత్పత్తిని తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల అవసరాలు కూడా తీర్చేలా ముందుకు సాగుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో చిన్న చిన్న విషయాల్లో ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఓ పెద్ద విపత్తు వేళ కూడా జగన్ సర్కారు కేవలం ప్రజల ఆరోగ్య పరిరక్షణ, దానికి సంబంధించిన ఉత్పత్తుల మీద మాత్రమే దృష్టి పెట్టడం గమనార్హం.