Idream media
Idream media
పేదరికంతో బాధ పడుతున్న కాపు,బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు అంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కాపు నేస్తం పథకం గొప్ప చేయూతగా నిలుస్తోంది. తన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే కాపు కులాల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆ కులాల అక్కచెల్లెమ్మల ఆర్థిక వృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఏటా రూ.15 వేలు..
ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారు లబ్ధి పొందుతారు. ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. 75 వేలు ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తుంది. ఇప్పటికి రెండు విడతలు అంటే వరుసగా రెండేళ్లు వారికి ఆవిధంగా చెల్లించింది.
రూ.981.88 కోట్లు జమ
వలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మొదటి ఏడాది ప్రభుత్వం 3,27,349 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.491.02 కోట్లు జమ చేసింది. రెండో ఏడాదికి గత నెలలో 3,27,244 మంది లబ్ధిదారులకు రూ.490.86 కోట్లు జమ చేసింది. ఆ విధంగా రెండేళ్లకు మొత్తం రూ.981.88 కోట్ల లబ్ధి చేకూర్చింది.
Also Read: ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
గతంలో ఇలా..
తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో కాపు,బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి రూ.400 కోట్లు మాత్రమే. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో నవరత్నాలతో సహా అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా 59,63,308 కాపు కులాల వారికి రూ.12,126.78 కోట్ల లబ్ధి చేకూర్చింది. టీడీపీ హయాం తో పోలిస్తే ఈ మొత్తం 15 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
కచ్చితంగా అమలు..
ప్రభుత్వం ఈ పథకం కింద అందజేస్తున్న మొత్తాన్ని సంవత్సరంలో ఏదో ఒక సమయంలో ఇవ్వడం కాకుండా ముందుగా ప్రకటించిన కేలండర్ ప్రకారం అందజేస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారికి, ఇతర ఆర్థిక అవసరాలు ఉన్నవారికి ఈ మొత్తం చేయూతగా ఉంటోందని అంటున్నారు.
Also Read: చిరు వ్యాపారులకు తప్పిన డైలీ ఫైనాన్స్ కష్టాలు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా..
కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయం కొనసాగిస్తూ గత ప్రభుత్వం కాలం వెళ్లదీసింది. చట్ట ప్రకారం సబ్ కేటగిరైజేషన్ చేయకూడదని తెలిసినా ఆ విధంగా చేసి న్యాయ వివాదాలు సృష్టించింది. అల్పాదాయ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా చేసింది. ఆ పరిస్థితిని చక్కదిద్ది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల ఏ రిజర్వేషన్లు లేని పేద, అల్పాదాయ వర్గాలకు విద్య,ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీనివల్ల కూడా కాపు కులాల వారికి గణనీయంగా లబ్ధి చేకూరు తోంది.
వివాదాస్పదమైన అంశాల జోలికి పోకుండా కాపు కులాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆయా వర్గాల వారు మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి తమ అభివృద్దికి ఊతమిస్తోందని కాపు కులాల వారు ఆనంద పడుతున్నారు.
Also Read: ఆ రెండు పధకాలు.. యువత భవితకు జోడు చక్రాలు