Idream media
Idream media
వైసీపీ అధికారంలోకి రాగానే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. నాణ్యమైన విద్యే విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తుందని సీఎం జగన్ గట్టిగా నమ్మి, ముందుకు సాగుతున్నారు.
పాఠశాలల రూపురేఖలు మార్చేలా నాడు – నేడు పనులు ప్రారంభించారు. విద్యార్థులు ఎంత వరకు చదివితే అంత వరకు చదివేలా ప్రోత్సహిస్తున్నారు. అమ్మవడి ద్వారా రూ.15 వేలు అందిస్తున్నారు. ఫీ రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత చదువు చెప్పేస్తున్నారు. హాస్టల్ లో వుంటూ చదువుకునే విద్యార్థుల కోసం వసతి దీవెన ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రైవేటు యూనివర్సిటీ లలో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేటు యూనివర్సిటీలలో ఇలాంటి విధానం లేదు. వీటిల్లో సీట్లను యూనివర్సిటీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా భర్తీ చేసేవి. దీనితో పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం అయ్యేవారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇస్తే.. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే అందిస్తుంది.
అలాగే, 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకరించింది. ‘‘పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకుంది ప్రభుత్వం.