iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఆశావహకంగా కనిపిస్తోంది. వరుసగా రెండో ఏడాది సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం విరామంతో గత ఏడాది అనుకూలంగా వర్షాలు కురిశాయి. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటుగా రాయలసీమలో కూడా సగటు వర్షపాతాన్ని మించి నమోదయ్యింది. దాంతో అన్ని చోట్లా చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి. పంటల దిగుబడులు ఆమాంతంగా పెరిగాయి.. అదే సమయంలో వర్షపాతం భారీగా నమోదు కావడంతో నదులన్నీ నిండి ప్రవహించాయి. కృష్ణా, గోదావరి నదులు పొంగి పోర్లాయి. సుదీర్ఘ కాలం అనంతరం తొలిసారిగా కృష్ణాలో మూడు సార్లు వరదలు వచ్చాయి. ప్రకాశం బ్యారేజీ్ నుంచి ఏకంగా 600 టీఎంసీల జలాలను సముద్రంలోకి వదలాల్సి వచ్చింది.
గోదావరిలో కూడా వరద మూడు నెలల పాటు కొనసాగింది. గత రెండు దశాబ్దాలలో అత్యధికంగా నీటి ప్రవాహం నమోదయ్యింది. దాంతో పంట కాలువలన్నీ సకాలంలో సాగునీరు తీసుకురావడంతో గత ఏడాది అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్లలో కలిపి రాష్ట్రంలో వరి దిగుబడులు పెరిగాయి. ఏకంగా 181 మిలియన్ టన్నుల వరి దిగుబడి కావడంతో రైతుల పంట పండింది. అన్నింటికీ మించి రాయలసీమలో కూడా రైతులకు ఉపశమనం కలిగించేలా వర్షాలు కురిశాయి.
ఇక ఏడాది ప్రస్తుతం సీజన్ మరోసారి ఆశాజనకంగా కనిపిస్తోంది. గత ఏడాది మాదిరిగానే ప్రారంభం ఉత్సాహంగా కనిపిస్తోంది. జూన్, జూలై మాసం తొలి అర్థభాగంలో పరిస్థితి రైతుల కలలు పండించేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ లో తొలిగారిగా ప్రకాశం జిల్లాలో కూడా సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదు కావడం విశేషం. దాంతో ఈసారి ఖరీఫ్ పనులు కూడా ఊపందుకున్నాయి. గతంలో చంద్రబాబు పాలనా కాలంలో పదే పదే కరువు పరిస్థితులు ఎదుర్కొన్న రైతులకు ఈసారి వరుసగా రెండో ఏడాది కూడా జగన్ పాలనలో వర్షాలు ఊపందుకోవడం ఉత్సాహం కలిగిస్తోంది. అటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా వర్షాలతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఆగష్ట్, సెప్టెంబర్ మాసాల్లో కూడా వర్షాలు కాస్త అనుకూలిస్తే ఇక ఈ సీజన్ లోనూ పంటల దిగుబడి పెరగడం ఖాయమని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన ఇన్ ఫుట్స్, ఎరువులు వంటివి అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం మరోసారి పండగలా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి కరోనా కారణంగా రైతుల పంటల అమ్మకాలకు కొంత ఇబ్బంది కలిగింది. అయితే పొగాకు వంటి పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం. ఇతర ఉద్యానవన పంటలకు మార్కెట్ సదుపాయం కల్పించే ప్రయత్నం జరగడంతో ఓమేరకు ఉపశమనం దక్కింది. వచ్చే ఏడాది పరిస్థితులు సర్ధుమణిగితే వాతావరణం సహకరించిన నేపథ్యంలో మరింత సంతృప్తికర పలితాలు ఖాయంగా చెప్పవచ్చు.