Idream media
Idream media
కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య లో ఆంధ్రప్రదేశ్ జాతీయ రికార్డు సాధించింది. పరీక్షల్లోనే కాకుండా రికవరీలోనూ ఏపీ ముందుకు దూసుకుపోవడం శుభపరిణామం. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభాతో పాటు, మౌలిక వసతుల్లో ముందున్న అతి పెద్ద రాష్ట్రాలు సైతం పరీక్షలు, రికవరీల్లో మనకంటే వెనక ఉన్నాయి. మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు చేస్తూ ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోఓ 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశ సగటు రికవరీ రేటు 87.78గా నమోదైంది. కేరళ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు కూడా రికవరీలో ఏపీ కంటే వెనకబడే ఉన్నాయి.
మరణాల రేటులోనూ…
ఆరు నెలల కిందట ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా ఏపీలో లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఏపీ సీఎం జగన్ అప్రమత్తం కావడం, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు 14 వైరాలజీ ల్యాబ్ లు, ట్రూనాట్ మెషీన్లతో పాటు యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిలియన్ జనాభాకు 1, 32, 326 మందికి టెస్టులు చేస్తున్నారు. 1, 23, 111 మందికి పరీక్షలు చేస్తూ అసోం రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కరోనా వ్యాధిగ్రస్తుల మరణాల నియంత్రణలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించడం గమనార్హం. గతంలో రోజుకు 90 మరణాలుండగా, ఇప్పుడా సంఖ్య 25కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏపీలో రికార్డు స్థాయిలో వైరస్ నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74, 945 నమూనాలు పరీక్షించగా 3,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7, 83,132కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 36, 474 ఉంది.