iDreamPost
android-app
ios-app

అధిక ఫీజుల నియంత్రణకు మరో అడుగు.. ఫోన్‌ చేస్తే సమస్య పరిష్కారం

అధిక ఫీజుల నియంత్రణకు మరో అడుగు.. ఫోన్‌ చేస్తే సమస్య పరిష్కారం

ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు ఫీజులు పేరుతో సాగిస్తున్న దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు జగన్‌ సర్కార్‌ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై ఏర్పాటు చేసిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాథమిక తరగతులు, ఉన్నత తరగతులు, ఇంటర్‌కు ఎక్కడ, ఎంత మొత్తం ఫీజులు అనేది జగన్‌సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల ఫీజులకు సంబంధించి జీవో నంబర్‌ 53, జూనియర్‌ కాలేజీల ఫీజులపై జీవో నంబర్‌ 54లను జారీ చేసింది.

విద్యను వ్యాపారంగా చేయడం చట్టరీత్యానేరం అనే విషయం నిర్వహకులకు తెలిసిన విషయమే. చట్ట ప్రకారం ఫీజులు ఎంత అనేది ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. అయితే ఆయా ఫీజులు వాస్తవ పరిస్థితుల్లో అమలు సాధ్యం కాని విధంగా ఉండేవి. చట్ట ప్రకారం ఇంటర్‌ విద్యకు సుమారు 3,500 రూపాయలు వసూలు చేయాలని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఇది ఆచరణలో సాధ్యం కాని విషయం. అందుకే జగన్‌ సర్కార్‌ ఆచరణ సాధ్యమైన ఫీజులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలను ప్రాంతాల వారీగా విభజించి, ఫీజులు నిర్ణయించింది ప్రభుత్వం. ప్రాథమిక విద్యకు గ్రామీణ ప్రాంతాలలో(1–5)కు రూ. 10 వేలు, మున్సిపాలిటీ పరిధిలో రూ. 11 వేలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో రూ. 12వేల రూపాయలు చొప్పన నిర్ణయించారు. ఉన్నత పాఠశాల విద్యకు గ్రామీణ ప్రాంతాలలో (6–10) 12 వేలు, మున్సిపాలిటీల్లో రూ. 15వేలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాల్లో రూ.18 వేల చొప్పన ఖరారు చేశారు.

ఇంటర్‌ విద్యకు గ్రామీణ ప్రాంతాలలోని కాలేజీల్లో ఎంపీసీ, బైసీపీ గ్రూపులకు రూ. 15,000, ఇతర గ్రూపులకు రూ.12,000, మున్సిపాలిటీల్లో రూ. 17,500, ఇతర గ్రూపులకు రూ.15,000, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు రూ. 20,000, ఇతర గ్రూపులకు రూ.18,000 చొప్పన నిర్ణయించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే ఈ ఏడాది నుంచి ఆయా కాలేజీ విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా ఎవరైనా వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా ఎవరైనా అధికంగా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 9150381111 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డిలు చెబుతున్నారు.

Also Read : విద్యార్థుల దశ, దిశను తీర్చిదిద్దేందుకు జగన్ మరో కానుక