iDreamPost
android-app
ios-app

కొనసాగుతున్న ‘పంచాయితి’.. గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ..

కొనసాగుతున్న ‘పంచాయితి’.. గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ..

ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పంచాయితీ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ పేరు చెప్పి మార్చిలో వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి, కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరికి వారు తమ వాదనలను వినిపిస్తున్నారు.

ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సర్కూలర్‌ జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారులు సిద్ధంగా ఉండాలని అందులో సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని, ఎన్నికలు ఫిబ్రవరిలో సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఎస్‌ఈసీకి తెలియజేసింది.  ఎన్నికల విధుల్లో పాల్గొనే తమకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.  అయినా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన ప్రయత్నాలను విడవడంలేదు.

ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కరోనా వైరస్‌నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు సాధ్యం కాదనేది ఆ తీర్మానం సారాంశం. అనువైన పరిస్థితులు ఏర్పడిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. అలా ప్రభుత్వం తీర్మానం చేసిందో లేదో.. ఎప్పటిలాగే నిమ్మగడ్డ కూడా తన ప్రయత్నాలను కొనసాగించారు. ఈ విషయంపై ఈ రోజు గవర్నర్‌కు లేఖ రాశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే ప్రకారం ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్‌ విధి. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సమాన అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ విరుద్ధం. దీనిని అడ్డుకోండి. అవసరమైతే సుప్రిం కోర్టు సలహాను తీసుకోండి’’ అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన లేఖలో కోరారు.