iDreamPost
android-app
ios-app

వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ..!

వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ..!

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల రంగుల వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది. వివాదాన్ని రాజేసిన వారే దానికి ముగింపు పలికారు. ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాల రంగులు మార్చాలంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలను.. తాజాగా ఆయనే వెన క్కి తీసుకున్నారు. దీంతో కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్ఫోజ్‌ చేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో ఈ వివాదం ముగిసినట్లైంది.

పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమం గ్రామాల్లో అమలు జరగాలంటే తప్పనిసరిగా రంగులు మార్చాల్సిందేనంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పట్టుబట్టారు. పట్టణాల్లో మాత్రం యథావిథిగా ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభం అయింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాలను నిమ్మగడ్డకు చూపించినా.. తాను చెప్పిన మేరకు రంగులు మార్చి తీసుకురావాలంటూ పట్టుబట్టారు. అయితే ఇందుకు భారీగా ఖర్చు అవుతుందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగులు వేయలేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో ప్రజలకు రేషన్‌ అందని విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఇది గతంలో ప్రకటించిన కార్యక్రమమేనని, శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు జరుగుతోందని విన్నవించింది. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రేషన్‌ పంపిణీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో గత నెల 11వ తేదీన పల్లెల్లో రేషన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమం ప్రారంభమైంది.

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల కోడ్‌ ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైనప్పుడు మళ్లీ కోడ్‌ అమలులోకి వస్తుంది. అప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పాలన సాధారణంగానే జరుగుతుంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో తన ఆదేశాలు నిలబడవని గ్రహించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వాటిని వెనక్కి తీసుకోక తప్పలేదు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కోడ్‌ అమలుల్లో ఉంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను చెలాయించాలనే భావనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ.. అప్పటి వరకు ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను చెలాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడం అధికారాల చెలాయింపులో భాగమే.