iDreamPost
android-app
ios-app

పురపోరుకు షెడ్యూల్‌ విడుదల

పురపోరుకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాల ఎన్నికలు తిరిగి ప్రారంభం కాబోతున్నారు. గత మార్చిలో కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పురపోరు ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 10వ తేదీన పురపాలక సంఘాల్లో పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల సంఘం తేదీని ప్రకటించింది.

మార్చిలో మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. వాటితోపాటు పురపాలక సంఘాల ఎన్నికలకు బ్రేక్‌ పడింది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ఉపసంహరణ వరకు కొనసాగగా, పురపాలక ఎన్నికలు నామినేషన్ల దాఖలు, పరిశీలన వరకు సాగాయి. నామినేషన్ల ఉపసంహరణ నుంచి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మార్చి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మరుసటి రోజు నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది. 10వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. అవసరమైన చోట 13వ తేదీన రీపోలింగ్‌ నిర్వహిస్తారు. 14వ తేదీన కౌటింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. ఒకే దశలో పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 16 మునిసిపల్ కార్పోరేషన్లలో 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. కాకినాడ పాలకవర్గానికి ఇంకా గడువు ఉంది. శ్రీకాకుళం వంటి నగరాల్లో ఎన్నికలకు న్యాయపరమైన సమస్యలున్నట్టు చెబుతున్నారు. మరో 75 మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో 671 డివిజన్లు, 2,123 వార్డులకు గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారం 18,649 దాఖలయ్యాయి.

Read Also : పట్టణాల వైపు దృష్టి మరల్చిన పార్టీలు, ప్రచార పర్వానికి శ్రీకారం