iDreamPost
android-app
ios-app

పింఛన్, రేషన్‌ పంపిణీ ఎలా..?

పింఛన్, రేషన్‌ పంపిణీ ఎలా..?

అదృశ్య శక్తి వెనుకుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నడిపిస్తోందనే విమర్శలకు బలం చేకూరేలా నిమ్మగడ్డ పని తీరు ఉంటోంది. ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికలు జరిగే సమయంలో సర్వం తానే అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ప్రకారం వలంటీర్లు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రజా సేవకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫించన్, రేషన్‌ ఎలా..?

వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న నిర్ణయం వరకూ.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా నిమ్మగడ్డ ఆదేశించడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో వలంటీర్లదే కీలక పాత్ర, ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ల ద్వారానే.. పథకాలకు దరఖాస్తు చేయడం, కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు, ఓటుకు దరఖాస్తులతోపాటు.. ప్రతి నెలా దాదాపు 60 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఫించన్‌ సొమ్మును అందిస్తున్నారు. వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేతలు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. ఇలా 12 కేటగిరిల్లోని వారికి ప్రతి నెలా 2,250 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకూ ఫించన్‌ అందిస్తున్నారు. లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి.. వారి వేలి ముద్రను తీసుకుని.. పింఛన్‌ నగదును ఠంచన్‌గా అందిస్తున్నారు.

బాబు అడిగాడు.. నిమ్మగడ్డ చేశాడు..

వలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లు వెనక్కి తీసుకుంటే.. ఫించన్‌ నగదు పంపిణీ ఎలా..? అనేది నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆలోచించలేదా..? ఎవరు..? ఎన్ని ఇబ్బందులు పడితేమి..? అనుకున్నారా..? అనే ప్రశ్నలుకు సమాధానం చెపాల్సిన పరిస్థితిని నిమ్మగడ్డ తెచ్చుకున్నారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చంద్రబాబు ఇప్పటికే డిమాండ్‌ చేశారు. ఆయన డిమాండ్‌ చేయడం.. నిమ్మగడ్డ అమలు చేయడం చకచకా జరిగిపోతోంది. బాబు ఎన్నికల విధులకు దూరంగా ఉంచమంటే.. నిమ్మగడ్డ అత్యుత్సాహంతో.. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు కూడా తీసేసుకోడంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తారు గానీ.. ఎన్నికల్లో పని చేయరన్న విషయం నిమ్మగడ్డకు తెలియనట్లుంది. తాను అనుకున్నదే జరగాలనే తీరుతో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60.19 లక్షల మందికి ఫించన్‌ ఎలా పంపిణీ చేయాలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారా..?

రేషన్‌ పంపిణీకి ఆటంకాలు..

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది నుంచి అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. కొత్త సంవత్సరంలో ప్రారంభించాలని అనుకున్నా.. వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ నెల 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రారంభించబోతున్నారు. రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర తదితర వస్తువులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి.. వలంటీర్లు తమ ఫోన్లలో వారి వేలిముద్రలు తీసుకుని పంపిణీ చేయబోతున్నారు. స్థానిక ఎన్నికలను సాకుగా చూపుతూ వలంటీర్లను సాధారణ సేవలకు కూడా దూరం చేయాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది.

అనాలోచిత నిర్ణయంతో చిక్కులు..

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల.. 60.19 లక్షల మంది ఫించన్‌దారులు, 1.50 కోట్ల మంది రేషన్‌కార్డుదారులు ఇబ్బందులు పడబోతున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలకు కూడా ఆగిన చోట నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మార్చి అర్థభాగానికి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫించన్లు, రేషన్‌ పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారే పరిస్థితి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వల్ల తలెత్తబోతోంది. నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడబోతున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read Also : పంచాయతీ ఎన్నికలకు ఎందుకంత ప్రాముఖ్యం..?