iDreamPost
android-app
ios-app

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మరో వివాదాన్ని రాజేసిన నిమ్మగడ్డ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మరో వివాదాన్ని రాజేసిన నిమ్మగడ్డ

స్థానిక ఎన్నికల వేళ వివాదాలతో సావాసం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఏపీ ఎస్‌ఈసీ) మరో వివాదానికి తెర లేపారు. గత ఏడాది మార్చిలో కరోనాను సాకుగా చూపి నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ప్రక్రియ పూర్తి అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని సరికొత్త వివాదం సృష్టించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రలోభాలు, బలవంతపు ఉపసంహరణలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి తాజాగా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ ప్రకటన జారీ చేశారు.

బెదిరింపులు, ప్రలోభాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయనే ఆధారాలతో అభ్యర్థులు కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయాలని ఎస్‌ఈసీ పేర్కొంది. నామినేషన్లను అడ్డుకున్న సమయంలో ఆర్‌వోలు, పోలీసులకు చేసిన ఫిర్యాదు కాపీలను కూడా కలెక్టర్లకు ఇవ్వాలని సూచించింది. ఆర్‌వోలు, పోలీసులకు ఫిర్యాదులు చేయకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదులు చేయవచ్చని కమిషన్‌ పేర్కొనడం అనేక అనుమానాలకు, వివాదాలకు తావిచ్చేలా ఉంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై అధికార పార్టీ మినహా ఇతర పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్నికల కమిషన్‌ చూపిన కారణాలనే ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు గతంలో ఫిర్యాదుల రూపంలో కమిషన్‌కు అందిచాయి. ఏకగ్రీవాలపై రాద్ధాంతం చేశాయి. అసలు మొత్తం ప్రక్రియనే రద్దు చేయాలనే డిమాండ్‌ను వినిపించాయి. టీడీపీ అనుకూల మీడియాలోనూ చర్చోపచర్చలు సాగాయి. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇట్టే అర్థమవుతోంది.

నామినేషన్లు దాఖలు చేసే సమయంలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలపై పోలీసులకు, ఆర్‌వోకు ఫిర్యాదులు చేయకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ ఇచ్చిన అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంలా ఉపయోగపడనుంది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజులో పలుమార్లు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆయా స్థానాల పేర్లను మీడియా ముఖంగా చదవి వినిపించారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన అంశాలను టీడీపీ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది, పత్రికలు ప్రచురించాయి. ఇప్పుడు ఆయా వార్తల క్లిప్పింగ్‌లతో తెలుగుదేశం పార్టీ నేతలు కలెక్టర్లకు ఫిర్యాదులు చేసే అవకాశం లభించింది. దీన్ని ఉపయోగించుకుని పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేసే అభ్యర్థులకు నగదు ఆశ చూపి పోటీలో నిలబెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసే అవకాశాన్ని తన నిర్ణయం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఇచ్చినట్లైంది. ఈ అంశంపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.