Idream media
Idream media
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కీలక సంస్కరణలను వడివడిగా అమలు జరుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల ఉద్యమం వంటి సమస్యలు, విపక్షాల విమర్శలు.. ఇలా ఎన్ని ఎదురైనా సాహసోపేతంగా ముందుకు దూసుకెళ్తున్నారు. సాహసోపేత నిర్ణయాల్లో ఇటీవల చెప్పుకోదగినది కొత్త జిల్లాల ఏర్పాటు. అది కూడా రెండు, నాలుగు కాకుండా ఒకేసారి పదమూడు జిల్లాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఉగాది నాటికి అన్ని చోట్లా కొత్త పాలన ప్రారంభం అవుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కేబినెట్లో కూడా మార్పులు, చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటే.. మూడు రాజధానులకు సంబంధించి కూడా కొత్త బిల్లును జగన్ సర్కారు తీసుకురానుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి మనుగడలోకి రానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది. ఇంకా సమయం ఉన్నందున- ఈ లోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై సర్కారు దృష్టి సారిస్తోంది. మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. పదిరోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా అందుకు ఫిబ్రవరి 18ని శుభ ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో తన నమ్మినబంటుకి ముఖ్యమైన శాఖలో మంత్రిగా అవకాశం కల్పిస్తారంటున్నారు. తనను నమ్ముకున్న వారికి భారీ ఎత్తున పార్టీలో ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారి సేవలు వినియోగించుకుంటారని తెలుస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిని పక్కన పెట్టనున్నారు జగన్.
మూడు రాజధానులకు మరో బిల్లు..
మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ మార్చి 4 న అసెంబ్లీలో మండలిలో బిల్లు పెట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. “దక్షిణాఫ్రికా మాదిరిగా మనం కూడా మూడు రాజధానులు పెట్టుకోవచ్చు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉండొచ్చు” అని అసెంబ్లీ సాక్షిగా 2019, డిసెంబర్ 17 న ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. బిల్లులోని కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని విపక్షాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండడంతో జగన్ సర్కారు బిల్లులను ఉపసంహరించుకుంది. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయాత్తమవుతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్.. ఇక కార్యాచరణలోకి దిగినట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాలతో పాటు.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలనే పట్టుదలతో వైఎస్ జగన్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా కీలక అంశాలకు సంబంధించిన నిర్ణయాలపై జగన్ వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే.. అతి త్వరలోనే ఏపీలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంచలన సీఎంగా గుర్తింపు పొందిన జగన్ మరి మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read : చెప్పిన సమయానికే కొత్త జిల్లాలు : స్పష్టం చేసిన జగన్