iDreamPost
android-app
ios-app

ఉత్తమ డీజీపీ … గౌతమ్ సవాంగ్

ఉత్తమ డీజీపీ … గౌతమ్ సవాంగ్

ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఒకేరోజు వివిధ జాతీయ స్ధాయి సంస్థల నుంచి మూడు అవార్డులను ఏపీ పోలీస్‌శాఖ అందుకుంది. వర్చువల్‌ విధానం ద్వారా మూడు జాతీయ అవార్డులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అందుకున్నారు.

రాష్ట్ర పోలీసుశాఖ వివిధ జాతీయ స్థాయి సంస్థల నుంచి కీలక అవార్డులను అందుకుంది. “స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్”కు సంబంధించి దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ప్రతిష్టాత్మకమైన “FICCI ఉత్తమ స్టేట్ అవార్డ్” దక్కించుకుంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసు శాఖలో అనేక విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి పోలీసింగ్, పబ్లిక్ సేఫ్టీలో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చిన డీజీపీలకు శనివారం ఈ అవార్డులను ఫిక్కీ అందజేసింది. ఇందులో ఉత్తమ డీజీపీగా గౌతం సవాంగ్ అవార్డు దక్కించుకున్నారు. ICJS (ఇంటెరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం)ను సంధానిoచడంలో అత్యున్నత ప్రతిభ ఏపీ పోలీస్ శాఖ కనబరిచి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

అవార్డు అందుకున్న సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థల నుంచి మూడు అవార్డులను అందుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని, అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు.

ఇదీ అవార్డుల నేపథ్యం.. !

2003 నుంచి దేశంలో స్కోచ్ అవార్డులను అందిస్తున్నారు. పాలనా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టిన వారికి ఈ గుర్తింపు దక్కుతుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డ్ ప్రకటించారు. సామాజిక మార్పులతో ప్రజలకు ప్రయోజనం కలిగించే వారికి గుర్తింపుగా స్కోచ్ గ్రూప్ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. 1997లో ప్రారంభించిన స్కోచ్ సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తుంది. సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా స్కోచ్ అధ్యయన బృందం వివిధ సంస్థలకు నివేదికలు అందిస్తుంది.

డీజీపీకి అభినందనలు

కాగా, అవార్డు అందుకున్న డీజీపీ సవాంగ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. రాష్ట్ర పోలీసు శాఖకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. శాఖలో మరిన్ని సంస్కరణలు చేపట్టి, ముందుకు సాగాలని ఆకాంక్షించారు.