Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల తొలి దశకు సమయం ఆసన్నమైంది. తుది పోటీలో ఎవరుండేది తేలిపోయింది. అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. నామినేషన్లు, అభ్యంతరాలు, ఉపసంహరణలు, పరిశీలన ప్రక్రియ దశలు ముగిశాయి. ఇక ప్రచారం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 9వ తేదీన తొలి విడత పోలింగ్ జరగబోతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు భవితవ్యం ఆ రోజు సాయంత్రానికి తేలిపోనుంది.
పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది తొలిసారి కాకపోయినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారశైలి కారణంగా ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జిల్లాల్లో పర్యటించడం, ప్రతి చోటా రాజకీయపరమైన వ్యాఖ్యలు, అధికార పార్టీ నేతలకు కౌంటర్లు, ఏకగ్రీవాలు జరగకూడదు, ఖచ్చితంగా పోటీ జరగాలనే ప్రకటనలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేశారు. తొలి విడతలో ఎన్నికలు లేని విజయనగరం జిల్లా మినహా మిగతా 12 జిల్లాలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పర్యటించారు. ప్రతి చోటా మీడియాతో మాట్లాడారు. అన్ని చోట్లా కామన్‌గా మాట్లాడిన అంశం ఏకగ్రీవాలు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే.. ఏకగ్రీవాలు కాదు, ఎన్నికలు జరగాలన్నారు. గతం కన్నా.. ఈ సారి ఏకగ్రీవాల సంఖ్య భారీగా తగ్గుతుందని ఘంటాపథంగా చెప్పారు. ఎన్నికల సమయంలో గొడవలు తలెత్తినా.. ఆ తర్వాత సమసిపోతాయన్నారు. ప్రజలు గొడవలు పడి, పల్లెలో అశాంతి నెలకొన్నా ఫర్వాలేదు గానీ ఎన్నికలైతే జరగాలనే లక్ష్యంతో పదే పదే నిమ్మగడ్డ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఎవరు ఏమి చెప్పినా.. గ్రామాల్లో కలసిమెలసి ఉండేవారు, స్థానిక సమస్యలు, ఇబ్బందులు తెలిసిన వారు ప్రజలు. ఎవరో వద్దన్నారనో, కావాలన్నారనో ఆయా పనులు చేసే స్వాభావం గ్రామీణ ప్రజలకు బహుతక్కువ. పంచాయతీ ఎన్నికల్లోనూ ఆదే స్వభావంతో వ్యవహరించారు. సమిష్టి నిర్ణయంతో ఏకమయ్యారు. విభేదాలకు తావులేకుండా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. తొలి విడతలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరగుతుండగా.. 523 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం పంచాయతీలలో ఇవి 16.09 శాతం కావడం విశేషం.
తానొకటి తాలిస్తే.. దైవమొకటి తలిచిందన్నట్లుగా.. ఏకగ్రీవాలపై తన లెక్క తప్పడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. అనవసరమైన గందరగోళం సృష్టించేందుకు ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయనే కారణం చూపుతూ చిత్తూరు, గుంటూరు జిల్లాలో వాటిని తాత్కాలికంగా పెడింగ్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏకగ్రీవాలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏ మాత్రం మింగుడు పడడంలేదనేందుకు ఈ చర్యలే నిదర్శనం. ఎవరు ఎన్ని చేసినా.. చివరకు ప్రజలు అనుకున్నదే జరుగుతుందని మరోసారి రుజువైంది.