తులసిరెడ్డి దాడి కోరుకుంటున్నారా..?

ఎంత కష్టపడ్డా పేరు రావడంలేదు. మీడియా ముందు గొంతు చించుకున్నా పొద్దున పేపర్‌లో వార్త సింగిల్‌ కాలందాటడం లేదు. పేపర్‌లో ఫొటోలు చూసి చాలా కాలమైంది. ఇక ఏదైనా చేయాలి. పేపర్లలో పతాక శీర్షికల్లో రావాలనుకుంటున్నారేమో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి. విశ్లేషకులు ఈ అనుమానాలు వెలిబుచ్చడానికి ప్రధాన కారణం తులసి రెడ్డి వ్యాఖ్యలే. రాజధాని మార్పుపై మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సదరు నేత డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో మూడు రాజధానుల విషయం చెప్పలేదని.. అలా చెప్పి ఉంటే వైఎస్సార్‌సీపీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తులసి రెడ్డి సవాల్‌ చేస్తున్నారు.

రాయలసీమ వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన తులసి రెడ్డి ఈ మాటలు విజయవాడలో అన్నారు. త్వరలో సీమలో కూడా అనే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడినే అటు సీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారు. అడపా దడపా కోడిగుడ్లు, టమోటల దాడి జరుగుతోంది. భారీ భద్రత ఉన్నా కూడా చంద్రబాబుకు తప్పడంలేదు. చంద్రబాబుకున్నంత సెక్యూరిటీ తులసిరెడ్డికి లేదు. పోలీసులు కూడా భారీగా రారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎలాగైనా తనపై దాడి చేస్తారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఏపీ కార్యనిర్వాహక అధ్యక్షుడినని అప్పటికైనా రాష్ట్ర ప్రజలు తనను గుర్తిస్తారేమోనన్న ఆశతో తులసి రెడ్డి ఇలాంటి సవాళ్లు విసురుతున్నరేమోనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

68 ఏళ్ల తులసి రెడ్డి ప్రస్తుతం ఇలాంటి స్థితిలో ఉన్నారు కానీ ఒకప్పడు ఢిల్లీ నుంచి గళ్లీ స్థాయి వరకు పదవులు చేపట్టారు. 1988 నుంచి
1994 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ వెంటనే కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు. 1955 నుంచి 2000 వరకు ఆ పదవిలో కొనసాగారు. మధ్యలో పదేళ్లకు పైగా పార్టీ పదవులతో సరిపెట్టుకున్నారు. మళ్లీ 2011 నుంచి 2014 వరకు 20 సుత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఇలాంటి నేతను ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారు.

Show comments