iDreamPost
iDreamPost
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి పెద్ద పదవుల పందేరానికి ముహూర్తం సమీపించింది. భారీ సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల పంపిణీ జరగబోతోంది. అధికారిక ప్రకటన వెలువరించేందుకు ప్రభుత్వ పెద్దలు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఈ వ్యవహారం వాయిదా పడింది. తొలుత వైఎస్సార్ జయంతి నాడు ప్రకటిస్తారని ఎక్కువ మంది ఆశించారు. అయితే దానికి సంబంధించిన కసరత్తులు పూర్తికాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
తొలుత గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నేతలకు, పార్టీ టికెట్ త్యాగం చేసిన వారికి, టికెట్ ఆశించి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. దానికి అనుగుణంగా కార్పోరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. కీలకమైన కార్పోరేషన్ల కోసం కొందరు నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
Also Read:రఘురామకృష్ణరాజు కూడా శరద్ యాదవ్ లాగే పదవిని కోల్పోతారా ?
2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలలో 24 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అందులో సగం మందికి ఇప్పటికే వివిద రూపాల్లో అవకాశం దక్కింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వంటి వారు తొలుత మంత్రులుగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. హిందూపురంలో ఓటమి పాలయిన ఇక్బాల్ కి రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. టెక్కలిలో పరాజయం పొందిన దువ్వాడ శ్రీనివాస్ కూడా మండలిలో చోటు దక్కించుకున్నారు. ఇక విశాఖ సౌత్ లో ఓటమి పాలయిన ద్రోణంరాజు శ్రీనివాస్ కి వీఎంఆర్డీయే పదవి దక్కినా ఆయన హఠాన్మరణంతో అది ఖాళీ అయ్యింది. గుంటూరు 2 నుంచి పోటీ చేసిన ఏసురత్నం మిర్చియార్డ్ చైర్మన్ హోదా దక్కించుకున్నారు. గన్నవరంలో ఓడిన యార్లగడ్డ వెంకట్రావు, పాలకొల్లులో పరాజయం పాలయిన కవురు శ్రీనివాస్ ఇద్దరికీ డీసీసీబీలు దక్కాయి. దాంతో ఇక మిగిలిన నేతలకు ప్రస్తుతం అవకాశాలుంటాయనే అంచనాలున్నాయి.
ఇప్పటికే కొందరు టికెట్ ఆశించిన నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. మరికొందరు మండలిపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కీలక నేతలకు వాటిని కేటాయించబోతున్నారు. ఇక మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉండడంతో దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల పంపిణీ జరగబోతోంది. సుమారుగా 90 చైర్మన్ పోస్టులున్నట్టు చెబుతున్నారు. అందులో సగానికి పైగా సీట్లకు ఏకాభిప్రాయం వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు పార్టీ అధినేతతో కీలక నేతలు సమావేశమయ్యారు. వివిధ ప్రతిపాదనలను పరిశీలించారు. దానికి అనుగుణంగా ఉమ్మడిగా నిర్ణయానికి వచ్చిన మేరకు తాజా ప్రకటనలో వెల్లడించే అవకాశం ఉంది.
Also Read:నేడే నామినేటెడ్ పదవుల పందేరం, ఆశావాహుల్లో సందడి
జగన్ అధికారం చేపట్టిన తర్వాత పదవుల పంపిణీలో పూర్తిగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా సగం సీట్లు రిజర్వుడు కేటగిరీలో మహిళలకు ఇస్తున్నారు. తాజా కేటాయింపులు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని పార్టీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అదే రేషియోలో పదవులు ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు. దాంతో ఇది జగన్ ప్రాధాన్యతలను చాటుతోంది. గతానికి భిన్నంగా అందరికీ న్యాయం చేసేందుకు సీఎం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, ఆశావాహుల్లో సందడి కనిపిస్తోంది. అధినేత దృష్టిలో ఉన్న జాబితా పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.