Idream media
Idream media
కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో తీవ్ర హింస చెలరేగిందని, పలు చోట్ల ప్రతిపక్షాల నేతలను నామినేషన్లు కూడా వేయనివ్వలేదని విమర్శలు చేశారు.
అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారంటూ విపక్షాలు ఎన్నికల సంఘానికి కూడా అప్పట్లోనే ఫిర్యాదులు చేశాయి. ఆ ఎన్నికలు ఆగిపోయాయి. మళ్లీ కొనసాగింపుగా మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయి. అయితే, నాటి ఫిర్యాదుల మేరకు కొన్నిచోట్ల మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు ఎస్ఈసీ గడువు ఇచ్చింది. కానీ ఎక్కడా పెద్దగా స్పందన రాలేదు. పుంగనూరులో అయితే ఒక్కరూ రీ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు గడువు ముగిసింది. గతంలో బెదిరింపుల కారణంగా పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అవకాశం ఇచ్చారు. కడప జిల్లా రాయచోటిలో 2 వార్డులు, ఎర్రగుంట్లలో 3 వార్డులు… చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక పోరులో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు ఇలా మొత్తం 14 చోట్ల రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు.
కడప జిల్లాలో నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. తిరుపతిలో ఆరు డివిజన్లకు మూడు రీ నామినేషన్లు దాఖలు చేశారు. పుంగనూరు మున్సిపాలిటీలో అయితే కొత్తగా అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. తిరుపతిలో 21వ డివిజన్‌లో టీడీపీ తరపున మునెమ్మ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి మునెమ్మ అందజేశారు. 45వ డివిజన్‌లో టీడీపీ తరపున చంద్రమోహన్ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి చంద్రమోహన్ అందజేశారు. 2వ డివిజన్‌లో దాసరి విమల టీడీపీ తరపున రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 10వ డివిజన్‌లో రీ నామినేషన్ వేయడానికి అవకాశం ఉన్నాఎవరూ ముందుకు రాలేదు.
పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డుల్లో రీ నామినేషన్ వేసేందుకు ఈసీ మరో అవకాశం ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ అవకాశం కల్పించింది. అయితే గడువు ముగిసినప్పటికీ తెలుగుదేశం నేతలు ఎవరూ నామినేషన్ వేసేందుకు రాలేదు. స్థానిక టీడీపీ నేతలు అప్పుడేం పాట పాడారో, ఇప్పుడు కూడా అదే మంత్రం జపిస్తున్నారు. వైసీపీ నేతల బెదిరింపులతో తమ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదని టీడీపీ పుంగనూరు ఇన్ చార్జి శ్రీనాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తమ శక్తినంతా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు, చంద్రబాబును సీఎం చేసేందుకే వినియోగిస్తారని సెలవు ఇచ్చారు. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాను అన్నట్లు శ్రీనాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.