iDreamPost
android-app
ios-app

పాత మంత్రులను జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా..

  • Published Apr 06, 2022 | 6:11 PM Updated Updated Apr 06, 2022 | 6:41 PM
పాత మంత్రులను జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా..

ఏపీలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు అంతా రెడీ అయిపోయింది. కొత్త మంత్రుల ఎంపిక ప్రక్రియలో సీఎం తలమునకలై ఉన్నారు. అదే సమయంలో పాత మంత్రులుగా ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుత క్యాబినెట్ గురువారం నాడు చివరి సారి భేటీ కాబోతోంది. ఆ సమావేశంలో సీఎం స్పష్టత ఇవ్వబోతున్నారు. మంత్రివర్గంలో ఉన్న నేతలందరికీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. పార్టీ వ్యవహారాల్లో వారందరికీ విధులు కేటాయించి, వాటిని పూర్తి చేయాలని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం క్యాబినెట్ మంత్రులుగా ఉన్న 24 మందిలో దాదాపుగా 20 మందికి పైగా పార్టీ బాధ్యతలు కేటాయించబోతున్నారు. అందులో సీనియర్ మంత్రులకు రీజినల్ కోఆర్డినేటర్లుగానూ, ఇతరులకు జిల్లా అద్యక్ష పదవులు అప్పగించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల, వేమిరెడ్డి వంటి నాయకులు ప్రాంతీయ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. మారిన జిల్లాలకు అనుగుణంగా రెండు మూడు జిల్లాలకు ఒక్కో నాయకుడికి బాధ్యత అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ప్రాంతీయ బాధ్యులైన విజయసాయి రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,వేమిరెడ్డిల మార్గదర్శకంలో పనిచేస్తారు.అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నాయకులకు అవకాశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

అంతేగాకుండా ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లున్నారు. వారి స్థానంలో కొత్తగా జిల్లా అధ్యక్షులను కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు మంత్రులను ఆ బాధ్యతల్లోకూడా నియమించేందుకు జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలైలో జరిగే ప్లీనరీ నాటికి పార్టీ సంస్థాగత వ్యవహారాలన్నీ చక్కబడాలని ఆశిస్తున్న జగన్ దానికి అనుగుణంగా నియామకాలు చేపట్టబోతున్నారు. త్వరలో ఎన్నికలకు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ మార్పులు సమర్థవంతంగా నిర్వహించే నాయకులకు తదుపరి మంత్రివర్గంలో మరోసారి చోటు కల్పించే యోచనలో సీఎం ఉన్నారనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దాంతో ఆయా మంత్రులు జిల్లాల వారీగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అది పార్టీలో పునరుత్తేజం కల్పించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.